తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ కూటమిగా ఏర్పడ్డాయి.టీఆర్ఎస్ పార్టీకి అధికారం దక్కకుండా చేయడమే కూటమి అంతిమ లక్ష్యంగా అందులోని పార్టీలు మొదట్లో ఉత్సాహంగా చెప్పుకొచ్చారు.
అయితే టీఆర్ఎస్ పార్టీని ఓడించడం అటుంచితే .ఇప్పుడు కూటమిలో ఐక్యత పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చే కొద్దీ తగ్గిపోతోంది.కూటమిలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారంలో ఏర్పడిన లుకలుకలు తారా స్థాయికి చేరాయి.ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే… కాంగ్రెస్ స్థానాలు కొన్ని పొత్తుల్లో పోగొట్టుకుంటున్నవారు గాంధీభవన్ మొదలు కొని జిల్లా కాంగ్రెస్ కార్యాలయాలవరకు తమ అనుచర గణంతో ఆందోళన కొనసాగిస్తున్నారు.
తమ సీట్లను ఇతర పార్టీలకు ఇస్తే సత్తా చూపిస్తామని నేరుగా ఏఐసిసి కె అల్టిమేటం లు ఇచ్చేస్తున్నారు.

మరోపక్క సిపిఐ – కాంగ్రెస్ పొత్తు లెక్కలు ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు.తాము తొమ్మిది నుంచి ఐదుకు దిగివస్తే కాంగ్రెస్ మాత్రం తొలినుంచి మూడు స్థానాలంటూ తమ పార్టీపై చిన్నచూపు చూస్తుందంటూ ఆ పార్టీ మండిపడుతుంది.ఇక సీపీఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఫైనల్ వార్నింగ్ కాంగ్రెస్ కు ఇచ్చేశారు.
సీట్ల సర్దుబాటులో కోరుకున్న ఐదుస్థానాలు ఇవ్వకపోతే కూటమికి గుడ్ బై చెప్పడంతో పాటు తాము అన్ని స్థానాల్లో పోటీకి దిగుతామని వెంకట రెడ్డి స్పష్టం చేశారు.నలభై స్థానాల్లో గెలుపు ఓటములను తమపార్టీ నిర్ణయిస్తుందని తొమ్మిది స్థానాల్లో బలమైన ఓటు బ్యాంక్ ఉందని చాడా ప్రకటించారు.

పొత్తుల వ్యవహారం గురించి కాంగ్రెస్ దూతలుగా వచ్చినవారు తమను తగ్గాలంటున్నారు తప్ప కాంగ్రెస్ ను సీట్లు పెంచమని ఎందుకు కోరడం లేదని వారి చర్చలు విఫలం అయినట్లు తేల్చేశారు.ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ తో పాటు నామినేషన్ల ప్రక్రియ సోమవారంనుంచి మొదలు కానున్న నేపథ్యంలో ఇక ఉపేక్షించేది లేదంటున్నారు చాడ వెంకటరెడ్డి.దీంతో… కూటమి పొత్తు వ్యవహారం పెద్ద తలపోటుగా మారింది.ఈ విధంగా కూటమిలో కుమ్ములాటలు చోటు చేసుకోవడంతో ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ ముందడుగు వేయలేకపోతోంది.
మరోపక్క చూస్తే టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారంలో దూసుకుపోతూ … కూటమిలో ఏర్పడ్డ తగాదాలను తమకు అనుకూలంగా మార్చుకుని లబ్ది పొందే ఆలోచనలో ఉంది.