కరోనా వచ్చిన తరువాత చాలా మంది మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి తలకిందులైన విషయం తెలిసిందే.అయితే ఓ కుటుంబం ఆర్థిక పరిస్థితుల నుండి గట్టెక్కడం కోసం ఏకంగా ఆలయాలను టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడుతోంది.
ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.
వికారాబాద్( Vikarabad ) జిల్లాలోని దోమ మండల పరిధిలోని బడెంపల్లి గ్రామంలో దుద్యాల వెంకటయ్య( Dudyala Venkataiah ) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.మొదటి భార్యతో గొడవల కారణంగా విడాకులు తీసుకొని, అరుణ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.
కరోనాలో లాక్డౌన్ కారణంగా వెంకటయ్య ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి.ఆర్థిక పరిస్థితుల నుండి ఎలా గట్టెక్కాలో తెలియక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.

అయితే ఓ సమయంలో బషీరాబాద్( Bashirabad ) మండలం మంతన్ గౌడ్ లోని హనుమాన్ దేవాలయంలో ఈ వెంకటయ్య దంపతులు సేదతీరారు.ఆ సమయంలో ఆలయ ప్రాంగణంలో ఎవరూ లేకపోవడంతో ఆలయంలో దోపిడీకి పాల్పడ్డారు.అప్పటినుండి తమ ఆర్థిక పరిస్థితుల నుండి గట్టెక్కడం కోసం ఆలయాలను టార్గెట్ చేసి దోపిడీలు చేయడం ప్రారంభించారు.దర్జాగా కారు, బైక్ పై ఆలయాలకు వెళ్లి దేవుని దర్శించుకుని సమయం చూసి దోపిడీ చేసేస్తారు.
ఈ క్రమంలోనే ఈనెల 25న వనపర్తి జిల్లా ఎక్లాస్పూర్ లోని బాలాజీ టెంపుల్ లో దోపిడీ చేశారు.పోలీసులకు ఆలయంలో దొంగతనం జరిగింది అని సమాచారం రావడంతో ఒక కారు నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
సీసీటీవీ కెమెరాలలో కారు నెంబర్ సరిగా కనిపించకపోవడంతో పక్కనే ఉన్న టోల్గేట్ సీసీ కెమెరాల ఆధారంగా ఆ కారు నెంబర్ సేకరించారు.

కారు నెంబర్ ఆధారంతో వెంకటయ్య దంపతులు పోలీసులకు చిక్కారు.పోలీసుల విచారణలో ఈ దంపతులు ఏకంగా 15 ఆలయాలలో చోరీకి పాల్పడినట్లు బయటపడింది.వికారాబాద్ జిల్లాలో 16, నారాయణపేటలో రెండు, వనపర్తి లో ఒక ఆలయంలో దొంగతనం చేసినట్లు ఆ దంపతులు ఒప్పుకున్నారు.
దోపిడీ చేసిన బంగారు, వెండి ఆభరణాలు స్థానికంగా అమ్మితే దొరికిపోతామని భావించిన దంపతులు సమయం దొరికినప్పుడల్లా పక్క రాష్ట్రాలకు వెళ్లి వాటిని అమ్ముకొని శుద్ధి చేసుకునేవారు.ఆ నిందితుల నుండి ఒక స్విఫ్ట్ కారు, బైక్, సెల్ ఫోన్, 3.3 తులాల బంగారు, 2.56 కేజీల వెండి ఆభరణాలతో పాటు రూ.178300ల నగదును స్వాధీనం చేసుకుని పోలీసులు రిమాండ్ కు తరలించారు.