కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం, బెండపూడి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లిష్ లో మాట్లాడుతున్న వీడియోలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన వీడియోలు యూట్యూబ్ లో చూసిన ఆస్ట్రేలియా దేశం సిడ్నీ నుంచి వినోద్, వివియన్ కుటుంబ సమేతంగా గురువారం బెండపూడి పాఠశాలను సందర్శించారు.ఇంగ్లీష్ ఉపాధ్యాయడు ప్రసాద్ మాస్టర్ విద్యార్థులకు సులభంగా ఆంగ్ల భాష లో మాట్లాడించిన విధానం, అనుసరించిన మెలుకువలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సాయంత్రం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టరు డా.కృతికా శుక్లా ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వినోద్, వివియన్ దంపతులు బెండపూడి పాఠశాల విద్యార్థుల మాదిరిగా జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడే విధంగా ప్రత్యేకంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను పైలట్ ప్రాజెక్ట్‌గా తుని నియోజకవర్గంలో ప్రారంభించిన READINESS INITIATIVE for SITUATIONAL ENGLISH (రైజ్) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నందుకు జిల్లా కలెక్టరు కృతికా శుక్లా ను అభినందించారు.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విధానాన్ని పరిశీలించేందుకు ఆస్ట్రేలియా దేశం నుంచి కాకినాడ జిల్లాకు విచ్చేసినందుకు కలెక్టరు సంతోషం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ కు చెందిన వినోద్ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు.ఆస్ట్రేలియాకు చెందిన వివియన్ ను వివాహం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో బెండపూడి ఇంగ్లిష్ టీచర్, రైజ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి.ప్రసాద్, కె పాల్ రాజ్ ఉన్నారు.