కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొత్త ఏడాదిలో సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఆయన సమాయత్తం అవుతున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఆయన పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించేశారు.మార్చి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజా సమస్యల పరిష్కరానికి కృషి చేస్తున్నట్లు వెంకట్‌రెడ్డి ప్రకటించారు.
పీసీసీ చీఫ్ పదవి రేస్‌లో తాను ఉన్నానంటూ ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసొచ్చిన కోమటిరెడ్డి ఇప్పుడు నియోజకవర్గ సమస్యలతోపాటు రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి పోరుబాట పడుతున్నారు.ఇదే విషయాన్ని ఆయన నార్కెట్‌పల్లిలో మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌పై కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.

సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన అనంతరం ఆయనలో మార్పు వచ్చింది.కమలనాథులు ఎక్కడ తనకు జైలుకు పంపుతారోనన్న భయంతోనే ఢిల్లీకి వెళ్లి వచ్చిన తరువాత కొత్త వ్యవసాయ చట్టాలకు గులాబీ బాస్ జై కొట్టారని కోమటి రెడ్డి ఆరోపించారు.
అంతేకాకుండా కేవలం తనమీద కోపంతోనే ఉదయసముద్రం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పనులు పెండింగులో పెట్టారని ఆరోపించారు.
అలాగే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులయిన శ్రీశైలం సొరంగ మార్గం నిర్మాణ పనుల కోసం రూ.వెయ్యి కోట్లు, ఉదయ సముద్రం ప్రాజెక్టు పనుల కోసం రూ.150 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు.ఈ నిధుల విడుదల కోసం జనవరి 7వ తేదీన విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిని దిగ్బంధం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ రహదారి దిగ్బంధంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నా అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వెంకట్‌రెడ్డి పేర్కొ న్నారు.