దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా విజయాలను సొంతం చేసుకున్న బీజేపీ రాష్ట్రంలో దూకుడు పెంచింది.టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెబుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమదే అధికారమనే ధీమాలో కమలనాథులు ముందుకు సాగుతున్నారు.
పార్టీని మరింతగా ముందుకు తీసుకుపోయేందుకు వలసలను ప్రోత్సహిస్తున్నారు.దీనికనుగుణంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని విధంగా సీట్లను రాబట్టిన బీజేపీవైపు ఇతర పార్టీలోని అసంతృప్తి నేతలు తొంగి చూడడం మొదలు పెట్టారు.
దీంతో బీజేపీలోకి చేరికలు ఊపందుకున్న విషయం తెలిసిందే.
ఇతర పార్టీల్లోని నేతలను తమ పార్టీలోకి లాగేసుకునేందుకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలపై బీజేపీ కన్నేసింది.
ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సాధించిన విజయంతో మంచి స్పీడు మీద ఉన్న కమలనాథుల కన్ను వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై పడింది.త్వరలో ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ జిల్లాలో ఉన్న బలమైన నేతలను తమ పార్టీలోకి చేర్చుకునే వ్యూహంను కమలనాథులు రచించినట్లు తెలిసింది.
ఈ క్రమంలోనే వరంగల్‌లో బలమైన నేతలుగా పేరున్న కొండా దంపతులపై బీజేపీ ఫోకస్ పెట్టి కొండా సురేఖ, కొండా మురళి దంపతులను బీజేపీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది.

అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ సీన్‌లోకి ఎంట్రీ కావడంతో బీజేపీ ప్రయత్నాలు బెడిసికొట్టినట్లు తెలిసింది.కొండా దంపతులతో మాణిక్కం ఠాగూర్ మాట్లాడి పార్టీ మారకుండా కమలనాథుల ప్లాన్‌ను ఆయన తిప్పి కొట్టినట్లు తెలిసింది.
పార్టీ మారుతున్నారనే వార్తలను కొండా మురళీ ఖండిస్తూ తాము పార్టీ మారట్లేదని, కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతామని చెప్పుకొచ్చారు.
అయితే కొండా దంపతులతో మాణిక్కం మాట్లాడిన తరువాతనే పార్టీ మారుతారనే ఆలోచనను కొండా దంపతులిద్దరూ విరమించుకున్నట్లు సమాచారం.ఇతర పార్టీ నేతల వలసలను ప్రోత్సహించే కార్యక్రమంకు వరంగల్‌లో బీజేపీకి ఇలా బ్రేక్ పడిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.