సాధారణంగా ఎన్నికలు అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వార్డు మెంబర్లు , సర్పంచులు, ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలు అంటే లక్షలాది రూపాయలు మంచినీళ్లలా అభ్యర్థులు ఖర్చు పెట్టాల్సిందే.
అదే శాసనసభకు వచ్చేసరికి ఖర్చు ఒక్కో అభ్యర్థికి అనధికారికంగా కోట్లాది రూపాయల ఉంటుంది.అయితే ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలలు సమయం ఉంటే ఖర్చు మరింతగా పెరిగిపోతుంది.
ఆ ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకునే అభ్యర్థులకు, పార్టీలకు ఆ భారం మరింతగా మారుతుంది.ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే గా ఉన్న ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఇప్పుడు హుజురాబాద్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
అయితే కోవిడ్ కారణంగా కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు గతంలో ప్రకటించడంతో హుజురాబాద్ లో ఉప ఎన్నికలు జరిగేందుకు కనీసం ఐదు నెలల సమయం పడుతుంది.

బీజేపీ అభ్యర్థిగా ఈటెల ఉండగా ఇక టీఆర్ఎస్ , కాంగ్రెస్ ల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి పేరు వినిపిస్తోంది.దీంతో ఆయన ఇప్పటికే నియోజక వర్గంలో తిరుగుతూ ప్రచారం మొదలు పెట్టేశారు.
ఇక టీఆర్ఎస్ అభ్యర్ధి ఎవరు అనేది క్లారిటీ రాకపోయినా , మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజక వర్గ నాయకులు ఇక్కడే మకాం వేశారు.ఇంత వరకూ బాగానే ఉన్నా, ఖర్చు విషయంలోనే అసలు చిక్కు వచ్చి పడింది.
ఇప్పటి నుంచే అన్ని వర్గాల ప్రజలకు చేరువ అయ్యేందుకు పార్టీలు, అభ్యర్దులు, టికెట్ ఆశిస్తున్న వారు ప్రయత్నాలు చేస్తున్నారు.

దీని కోసం మంది మార్బలాన్ని వెంటేసుకుని మరీ నియోజకవర్గం అంతా తిరగాల్సి రావడం, దాని కోసం భారీగా సొమ్ములు ఖర్చు పెట్టాల్సి రావడం, వెంట తిరుగుతున్న వారికే కాకుండా వివిధ సంఘాల నేతలను తమ దారిలోకి తెచ్చుకోవడం కోసం భారీ భారీ గానే ఖర్చులు, వాహనాలు, వాటికి ఆయిల్, భోజనాలు ఇలా నిత్యం లక్షల్లో నే ఖర్చు పెట్టాల్సి రావడంతో అభ్యర్దులు బాధగానే సొమ్ములు ఖర్చు పెడుతున్నారు.అయితే ఎన్నికలకు ఇంకా చాలా నెలలే ఉండడం తో అప్పటి వరకు ఖర్చు ఇలా పెట్టాల్సి రావడం తలకు మించిన భారమే అంటూ లబోదిబో మంటున్నరట.