ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించేందుకు ప్రత్యర్థి పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి.అందుకోసం కలిసికట్టుగా పోరాడుదామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
ఇదే సమయంలో ఏపీలో ఒక పదం మీద తెగ చర్చ నడుస్తోంది.ఇంతకీ ఆ పదం ఏమిటని అనుకుంటున్నారా? రోడ్ మ్యాప్.అవును ప్రస్తుతం రోడ్ మ్యాప్ అనే ఈ పదం మీద జోరుగా చర్చోపచర్చలు నడుస్తున్నాయి.నేతలెవరి నోట విన్నా ఇదే మాట వస్తోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.మొన్న జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.
బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే అధికార వైసీపీని ఓడించి తీరుతామని ప్రకటించారు.ఇక ఇదే విషయంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు.
బీజేపీ అగ్ర నేత అమిత్ షా రెండు నెలల కిందటే రోడ్ మ్యాప్ ఇచ్చారని ప్రకటించారు.రెండు నెలల కిందటే రోడ్ మ్యాప్ ఇస్తే బీజేపీ మిత్రపక్షంగా ఉన్న పవన్ కల్యాణ్ కు ఈ విషయం తెలియదా అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ రోడ్ మ్యాప్ అంశంపై ప్రస్తుతం అనేక మంది నేతలు కామెంట్లు చేస్తున్నారు.ఇదే విషయంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ కూడా మాట్లాడారు.బీజేపీ పార్టీ పవన్ కల్యాణ్ కు రోడ్ మ్యాప్ ఎందుకిస్తుందని ఎద్దేవా చేశారు.వారు అధికార వైసీపీకే రోడ్ మ్యాప్ ఇస్తారని విమర్శించారు.
అంతే కాకుండా త్వరలోనే జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీ పార్టీతో తెగతెంపులు చేసుకుంటారని జోస్యం చెప్పారు.వైసీపీనే కాదు బీజేపీ పార్టీని కూడా గద్దె దించాలని పవన్ కల్యాణ్ కు రామక్రిష్ణ సూచించారు.
అందుకోసం జతకట్టాలని కోరారు.మరి రామక్రిష్ణ చెప్పిన విధంగా పవన్ బీజేపీతో దోస్తీకి వీడ్కోలు పలుకుతారో? లేదో? వేచి చూడాలి.