తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు ప్రతి ఒక్క పార్టీలో జరుగుతున్న కీలక పరిణామాలతో హాట్ హాట్ గా మారుతున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తే టీఆర్ఎస్ టార్గెట్ గా పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితుల్లో ఎవరి వ్యూహాలను వారు ఖచ్చితంగా అమలు చేసేలా పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.
అయితే టీఆర్ఎస్ పార్టీ లో ఇక అసంతృప్తి జ్వాలలు పెద్ద ఎత్తున పెల్లుబుకితున్న పరిస్థితి అక్కడక్కడ జిల్లాలలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి మనకు తెలుస్తోంది.మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు భేటీ కావడం ఒక్కసారిగా రాజకీయ వర్గాలలో సంచలనం రేపింది .
అయితే భేటీపై ఇరువురు నేతలు అంతగా స్పందించకున్నా ఇక ఊహాజనిత వార్తలు రాజకీయ వర్గాలలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది.అయితే కొందరు బీజేపీలో చేరనున్నారనే ప్రచారం సాగిస్తుండగా మరికొందరు మౌనం వహించి చివరి నిమిషం వరకు వేచి చూసే ధోరణిని కొనసాగిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.
అయితే ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ఇద్దరు నేతలు కీలక నేతలు కావడం ఇక్కడ చర్చనీయాంశంగా మారడానికి ప్రధాన కారణం.వీరు కనుక ఒకవేళ టీఆర్ఎస్ కు దూరమైతే ఎన్నికల సమయంలో కాస్త ఇబ్బందికర వాతావరణమే ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.
అయితే ఈ విషయాలన్నీ కెసీఆర్ దృష్టిలో ఉన్నా సరైన సమయంలో స్పందిస్తారని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంతర్గతంగా చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది.ఏది ఏమైనా అసంతృప్తులతో టీఆర్ఎస్ చర్చలు జరిపితేనే ఎంతో కొంత టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక వాతావరణానికి అడ్డుకట్ట పడే అవకాశం కనిపిస్తోంది.







