పార్టీ అంటే అభిమానం ఉన్నా, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడాలని, ప్రశ్నించాలని , నిలదీయాలని ఉన్నా, ముందుకు వచ్చే పరిస్థితి లేదు.అధికార పార్టీ వివిధ కారణాలు చూపించి కేసుల పేరుతో వేధింపులకు గురి చేస్తుందనే భయం, కేసుల్లో చిక్కుకుంటే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అనే ఆందోళన మొదలైన కారణాలతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అధికార పార్టీ వైసీపీపై పోరాడేందుకు వెనకడుగు వేస్తోంది.
గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి, మాజీ మంత్రుల వరకు అంతా ఇదే భయంతో ఉన్నారు.ఇప్పటికే పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు చాలామంది వివిధ కేసుల్లో ఇరుక్కుని జైలు పాలవడం, కోర్టుల చుట్టూ తిరగడం, వేధింపులకు గురవడం తదితర కారణాలతో మిగతా పార్టీ కేడర్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ పరిస్థితుల్లో పార్టీ ప్రభుత్వంపై పోరాడాలని పిలుపు ఇచ్చినా, ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో నాయకులు ఉండిపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు చాలాకాలంగా నిరుత్సాహంగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 800 మంది టిడిపి నాయకుల పై అక్రమ కేసులు బనాయించారు అనేది ఆ పార్టీ ఆరోపిస్తోంది.
ఈ కారణాలతోనే పార్టీ పిలుపునిచ్చినా ఎవరు ఉత్సాహంగా ముందుకు రావడం లేదని, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపే విధంగా ప్రయత్నాలు చేస్తున్నా, ఫలితం ఉండడం లేదని, టీడీపీ అధినాయకత్వం వాదిస్తోంది.ఇదే తరహా ఫిర్యాదులు తరచుగా వస్తుండడంతో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇకపై అక్రమ కేసుల్లో ఇరుక్కున్న నాయకులకు న్యాయ సహాయం అందించాలనే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు ఒక స్థాయి ఉన్న నాయకులకు మాత్రమే న్యాయసాయం పార్టీ తరఫున అందించేది.
కానీ ఇకపై మండల స్థాయి నాయకులు కూడా న్యాయ సహాయం అందిస్తే పార్టీ కేడర్ లో ఉత్సాహం పెరుగుతుందనే అభిప్రాయానికి చంద్రబాబు వచ్చారట.

ప్రతి మండలానికి ఒక న్యాయవాదిని పార్టీ తరఫున నియమించాలి అని, వారి ఖర్చు కూడా పార్టీ కేంద్ర కార్యాలయం భరించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.ఏదైనా అక్రమ కేసుల్లో పార్టీ నాయకులు ఇరుక్కుంటే వారు జైలుకు వెళ్లకుండా తక్షణమే బెయిల్ లభించే విధంగా, వారి తరుపున వాదించే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.ఈ విధంగా చేస్తే పార్టీ క్యాడర్ భయం పోయి మరింత ఉత్సాహంగా ముందుకు వస్తారనే అభిప్రాయంతో ఈ విధమైన సహాయం చేసేందుకు పార్టీ ముందుకు వచ్చినట్టు గా కనిపిస్తోంది.