తెలంగాణా – అంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాజకీయాలలో ఆకర్షణ పర్వం భారీగా సాగుతోంది.కానీ రెండు చోట్లకీ చాలా తేడా కనిపిస్తోంది.
తెలంగాణా పాలక నేత తెరాస చేపట్టిన ఆకర్షణ మంత్రానికి కాంగ్రెస్ – టీడీపీ – బీజేపీ అనే తేడా లేకుండా అందరు పార్టీల వారూ తెరాస లోకి వచ్చి పడుతున్నారు.కానీ ఏపీ పాలక టీడీపీ ఈ విషయంలో కాస్త తక్కువగానే ఉంది అని చెప్పాలి.
ఇతర పార్టీల వారు టీడీపీ కి రావడానికి సిద్దంగా ఉన్నా కూడా పార్టీలోని వారే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.అధినేత చంద్రబాబు ఒప్పుకున్నా కూడా తమ కార్యకర్తలు ఒప్పుకోవడం లేదు అనే సాకు చూపించి, అనుచరుల ద్వారా వ్యతిరేకత వ్యక్తం చేయించి మరీ ఇబ్బందులు సృష్టిస్తున్నారు.
విశాఖపట్టణం – కడప జిల్లాలో పాగా ఏర్పరచుకోవాలి అను ప్లాన్ లు చేస్తున్న టీడీపీ హై కమాండ్ కి ఈ రకమైన ఇబ్బందులు చాలా తలనొప్పిగా మారాయి.అక్కడ టీడీపీ నేతలు – శ్రేణులు ఎవ్వరూ తమ పార్టీలోకి వేరే పార్టీ వారు రాకుండా గట్టిగానే అడ్డుపడుతున్నారు.
అంతేకాదు.వారొస్తే తాము రాజీనామా చేస్తామంటూ ప్రస్తుతం టీడీపీలో ఉన్నవారు బెదిరిస్తున్నారు కూడా.
విశాఖ జిల్లా అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ – కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రాకను వ్యతిరేకిస్తూ అక్కడి టీడీపీలో తిరుగుబాట్లు మొదలయ్యాయి.జమ్మల మడుగులో అయితే ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి తో పాటు ఆయన వర్గం టీడీపీ లోకి రావడం శ్రేణుల్లో చాలా పెద్ద గొడవ రేపుతోంది.
ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి వస్తే టీడీపీలో ఉన్న రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్లే ప్రమాదమూ కనిపిస్తోంది అక్కడ.విశాఖజిల్లా లో కొణతల టీడీపీ లోకి రావడాన్ని గంటా శ్రీనివాసరావు తీవ్రంగా అడ్డుకుంటున్నారు.
తన మిత్రుడు కెసిఆర్ అనుసరిస్తున్న మార్గం ఏంటో తెలుసుకుని మరీ చంద్రబాబు వ్యవహరిస్తే బాగుంటుంది అని అంటున్నారు విశ్లేషకులు.