అఫ్గాన్ లో నెలకొన్న తాజా పరిస్థితులు భద్రతా పరంగా కొత్త సమస్యలు సృష్టిస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమర్థంగా అప్రమత్తతతో ఎదుర్కోగలదని ధీమా వ్యక్తం చేశారు.
బిజెపి సీనియర్ నేత బలరామ్ దాస్ టాండన్ 3వ వర్ధంతి సందర్భంగా జాతీయ భద్రత అంశంపై పంజాబ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన వర్చువల్ గా పాల్గొని స్మారకోపన్యాసం చేశారు.ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలను ఆసరాగా చేసుకుని సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశ వ్యతిరేక శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు.
ఆఫ్గాన్ లో పరిణామాలను మన ప్రభుత్వం ఎప్పటికప్పుడు గ్రహిస్తుందన్నారు.దేశ వ్యతిరేక శక్తులు సరిహద్దు నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు అవకాశం ఇవ్వరాదన్నారు.
మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉందన్నారు.వాయు, జల, భూ మార్గాల్లో ముప్పు ఏ వైపు నుంచి వచ్చినా ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నట్లు రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు నూతన సవాళ్లను ఎదుర్కొనేందుకు జాతీయ భద్రతా వ్యవస్థను ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేస్తున్నట్లు చెప్పారు.

1965, 1970 లో జరిగిన యుద్ధాల్లో పరాజయం పాలైనా పాకిస్థాన్ కు భారత్ తో పూర్తిస్థాయి యుద్ధం చేసే పరిస్థితి లేదని అన్నారు.మనతో నేరుగా తలపడే ధైర్యం లేని పాకిస్తాన్ ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, ఆయుధాలు, ఆర్థిక వనరులు సమకూర్చడం ద్వారా భారత్ ను లక్ష్యంగా చేసుకుంటోందన్నారు.