మారుతున్న కాలానికి తగ్గట్లుగా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో సంస్కరణలు తీసుకొస్తోంది కెనడా( Canada )మెరుగైన జీవన ప్రమాణాలు, నాణ్యమైన విద్య, మంచి ఉద్యోగావకాశాలు వుండటంతో పలు దేశాల విద్యార్ధులు ప్రధానంగా భారతీయులు కెనడాకు క్యూ కడుతున్నారు.అలాగే సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, వీసా జారీ, త్వరగా శాశ్వత నివాస హోదా వంటి అనుకూల అంశాలు కెనడా వైపు మన విద్యార్ధులను ఆకర్షిస్తున్నాయి.
కోవిడ్ తర్వాత ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు తీసుకురావడంతో కెనడాకు వలసలు పెరుగుతున్నాయి.

అయితే .ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం వుండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది.
ఇప్పటికే ఇరుదేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించగా. కెనడాలోని వీసా ప్రాసెసింగ్ కేంద్రాన్ని భారత్ మూసివేసింది.
ఇరుదేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు అంతర్జాతీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయి.ఈ దౌత్యపరమైన ఉద్రిక్తతలు భారతీయ విద్యార్ధుల రాకపై ప్రభావం చూపుతున్నాయి.
గతేడాది డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కేవలం 14,910 పర్మిట్లను మాత్రమే కెనడా జారీ చేయగా.అంతకుముందు మూడు నెలల వ్యవధిలో ఈ సంఖ్య 1,08,940గా వుంది.
అంటే దాదాపు 86 శాతం తగ్గుదల.

మరోవైపు.వీసాల జారీ సంఖ్య తగ్గడానికి మరో వాదన కూడా వుంది.నిజ్జర్ హత్య తర్వాత ఢిల్లీ( Delhi )లోని కెనడా రాయబారులను తగ్గించుకోవాలని భారత ప్రభుత్వం ఆ దేశానికి సూచించింది.
దీంతో 41 మంది దౌత్యాధికారులను కెనడా వెనక్కి తీసుకుంది.అందువల్ల స్టడీ పర్మిట్లను ప్రాసెస్ చేయడం కుదరడం లేదని కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ పేర్కొన్నారు.
ఇప్పుడే కాదు.భవిష్యత్తులోనూ స్టడీ పర్మిట్ల జారీ పెరిగే అవకాశాలు కనిపించడం లేదని మిల్లర్ తేల్చిచెప్పారు.నిజానికి కెనడాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వచ్చే విదేశీ విద్యార్ధుల్లో భారతీయులదే అగ్రస్థానం.2022లో 2,25,835 స్టడీ పర్మిట్లు జారీ చేయగా అందులో మన విద్యార్ధుల సంఖ్య 41 శాతం.అయితే అంతర్జాతీయ విద్యార్ధుల రాక పెరుగుతూ వుండటంతో తమ దేశంలో నిరుద్యోగం, ఇళ్ల కొరత సమస్యలు తలెత్తుతున్నాయని మిల్లర్ వ్యాఖ్యానించారు.ఈ క్రమంలోనే విదేశీ విద్యార్ధులపై ఆంక్షలు విధించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇది కూడా భారతీయ యువతను ఆలోచనలో పడేసింది.







