ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎవరు ఊహించని విధంగా టిడిపిలో రేపు చేరనున్నారు.ఆయనకు సత్తెనపల్లి టిక్కెట్ కూడా కేటాయిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.
అంతేకాకుండా తన అనుచరులకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇచ్చే విధంగా చంద్రబాబును కన్నా ఒప్పించారట .పార్టీలోను , 2024 తర్వాత ప్రభుత్వం ఏర్పడితే అప్పుడు తగిన ప్రాధాన్యం ఇస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో కన్నా బిజెపిని వీడి టిడిపిలో చేరబోతున్నారు.అయితే మొదటి నుంచి కన్నా టిడిపిని భద్ర శత్రువు గానే చూశారు.ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు, ఆ పార్టీలోని కీలక నాయకులందరినీ తీవ్రస్థాయిలో విమర్శించారు.
విద్యార్థి దశ నుంచి కన్నా కాంగ్రెస్ వాదిగనే ఉన్నారు.దాదాపు మూడు దశాబ్దాలకు పైగా టిడిపిని ఆయన వ్యతిరేకిస్తూనే వచ్చారు.
అయితే కన్నా కు ఉన్న రాజకీయ అనుభవం, సామాజిక వర్గం, ఇవన్నీ లెక్కలు వేసుకుని 2014 ఎన్నికల సమయంలోనే కన్నాను టిడిపిలో చేరవలసిందిగా టిడిపి ఆహ్వానించినా ఆయన మాత్రం ఆ పార్టీ వైపు వెళ్లలేదు.అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో , కన్నా టిడిపిలోకి వెళ్తున్నారు.
ఇప్పటి వరకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ , బిజెపిలోనే ఉన్న ఆయన, ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం లో చేరుతుండడంతో ఆయన ఆ పార్టీలో అడ్జస్ట్ అవ్వగలరా అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.జాతీయ పార్టీల విధానాలు ప్రాంతీయ పార్టీల విధానాలు వేరువేరుగా ఉంటాయి.
ప్రాంతీయ పార్టీ అధినేత కనుసన్నల్లోనే పూర్తిగా అన్ని కార్యకలాపాలు చోటు చేసుకుంటాయి.

ప్రాంతీయ పార్టీ అధినేత చెప్పినట్లుగానే నడుచుకోవాల్సి ఉంటుంది.జాతీయ పార్టీలో ఉన్నంత స్వతంత్రత ఇవేమీ ఇక్కడ పనిచేయవు.దీంతో కన్నా టిడిపిలో ఇమడగలరా అనే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి.
ఇప్పటికే కన్నా రాకను టిడిపిలోని చాలామంది నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఆయన పార్టీలో చేరినా తాము పట్టించుకోము అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు.

దీనికి కారణం కన్నా కారణంగా గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులేనట.ముఖ్యంగా గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నా విషయంలో అసంతృప్తితో ఉన్నారు.గతంలో ఈ ఇద్దరు కాంగ్రెస్ లో పనిచేశారు.ఆ తర్వాత రాయపాటి టిడిపిలో చేరారు.అయితే కన్నా టిడిపిలో చేరబోతున్నారనే వార్తలు బయటకు వచ్చిన వెంటనే రాయపాటి స్పందించారు.కన్నా టిడిపిలో ఎలా చేరుతారో చూస్తానని, ఆయన గనుక పార్టీలో చేరితే టిడిపి అధిష్టానంతోనే తాడోపేడో తేల్చుకుంటానంటూ రాయపాటి వ్యాఖ్యానించారు.
ఇప్పుడు పార్టీలో కన్నా లక్ష్మీనారాయణ చేరిన తర్వాత అసలు సిసలైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.మరి వాటిని కన్నా ఎలా ఎదుర్కొంటారో ?
.