ఒకసారి వార్ మొదలయితే అది వన్ సైడ్ అయిపోవాల్సిందే అని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి.తమ ప్రత్యర్థులకంటే ఎప్పుడూ తామే పై చేయి సాధించాలని చూస్తుంటాయి.
ఇవన్నీ రాజకీయాల్లో సహజంగా ఉండేవే.ప్రస్తుతం తెలంగాణాలోనూ ఓ పొలిటికల్ వార్ వాడి వేడిగా జరుగుతోంది.
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ మధ్య, కేంద్ర అధికార పార్టీ బీజేపీ మధ్య ఇప్పుడు పోటీ నడుస్తోంది.రెండు పార్టీలు తెలంగాణాలో పట్టు సాధించేందుకు చూస్తున్నాయి.
పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు మిత్ర పక్షాలుగా కనిపించిన ఈ రెండు పార్టీలు ఆ తరువాత మెల్లి మెల్లిగా వార్ మొదలుపెట్టాయి.మరో రెండేళ్ళు ఆగితే తామేంటో చూపిస్తాం అంటూ బీజేపీ నేతలు టీఆర్ఎస్ కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ప్రస్తుతానికి ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తారా స్థాయికి చేరడానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది.టీఆర్ఎస్ పార్టీ కొద్ది రోజుల క్రితం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించింది.ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 50 వేల సభ్వత్వాలు చేయించాలని కండిషన్స్ కూడా పెట్టారు.ఈ లెక్కన టీఆర్ఎస్ సభ్యత్వ టార్గెట్ 59 లక్షలు.గతేడాది 70 లక్షల సభ్యత్వం టార్గెట్‌తో రంగంలోకి దిగిన టీఆర్ఎస్ నాయకులు 50 లక్షల మందిని చేర్పించారు.ఈ సంవత్సరం కోటి మందికి టీఆర్ఎస్ సభ్యత్వం ఇవ్వాలని ముందుగా భావించినా, మొదటి విడతను 59 లక్షల టార్గెట్‌నే పెట్టుకున్నారు.
గతేడాది సభ్యత్వం చేయించేందుకు వేరే పార్టీలు పోటీలో లేకపోవడంతో సుమారు 50 లక్షలమందికి సభ్యత్వం ఇచ్చారు.ప్రస్తుతం బీజేపీ పోటీలో ఉండి సభ్యత్వ నమోదులో వేగం పెంచింది.

తెలంగాణాలో బలపడడానికి బీజేపీ గట్టిగానే పావులు కదుపుతోంది.సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షానే రంగంలోకి దిగిపోయారు.రంగారెడ్డి జిల్లాలోని ఒక తండాలో గిరిజన మహిళ కుటుంబానికి సభ్యత్వం ఇచ్చి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.గతేడాది బీజేపికి 18 లక్షల సభ్యత్వం ఉంది.ఇప్పుడు కొత్తగా మరో 18 లక్షలు కలిపి మొత్తం 36 లక్షలకు చేరువ అవ్వాలని బీజేపీ భావిస్తోంది.మీరు సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయకపోతే, తానే ఇంటింటికి తిరిగి పార్టీ సభ్యత్వం చేయిస్తానని అమిత్ షా చెప్పటంతో, రాష్ట్ర బిజెపి నేతలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలవటం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో విలీనం కావటంతో ఇదే తమకు అనువైన సమయంగా బీజేపీ నేతలు భావిస్తున్నారు.







