ఏపీలో బీజేపీ జనసేన ( BJP Janasena ) పార్టీల మధ్య పొత్తు వ్యవహారంపై చాలా కాలంగా ఒక రకమైన కన్ఫ్యూజన్ రెండు పార్టీల నేతల్లో కలుగుతోంది.ఏ ఒక్క విషయంలోనూ రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లకపోవడం, ప్రజా పోరాటాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టకపోవడం, ఒక పార్టీ కార్యక్రమాలలో మరో పార్టీ పాలుపంచుకోకపోవడం, ఒకరికి మద్దతుగా మరొకరు నిలబడకపోవడం ఇవన్నీ మొదటి నుంచి జనసేన బిజెపి మధ్య పొత్తు కొనసాగుతుందా లేదా అనే అనుమానాలకు బలం చేకూరుస్తూనే వస్తున్నాయి.
ఇక 2024 ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందా లేదా అనేది కూడా అనుమానంగానే మారింది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) టిడిపితో పొత్తు విషయంలో జనసేన ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నా.
బిజెపి మాత్రం టిడిపిని కలుపుకు వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు.ఇది ఇలా ఉంటే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి మద్దతు కోరినా పవన్ స్పందించలేదు అంటూ జనసేన బీజేపీ పొత్తుపై బిజెపి నేత మాధవ్ కామెంట్ చేశారు.

గతంతో పోల్చుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి ఓట్ల శాతం పెరిగిందని, విశాఖలో ఓట్ల శాతం తగ్గిందని, కానీ మిగతా చోట్ల ఓట్ల శాతం పెరిగిందని మాధవ్ ( Madhav ) అన్నారు.జనసేనతో కలిసే ఉన్నాం కానీ, కలిసి ఉన్నా లేనట్టేనని మేం భావిస్తున్నాం అంటూ మాధవ్ వ్యాఖ్యానించారు.జనసేనతో కలిసి బిజెపి ప్రజల్లోకి వెళ్తేనే పొత్తు ఉందని నమ్ముతారని మాధవ్ అన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మాతో కలిసి రాలేదని ఆరోపించారు.
తమ అభ్యర్థికి జనసేన మద్దతు ఉందని పిడిఎఫ్ చెప్పుకుంటే ఈ విషయాన్ని ఖండించమని జనసేనను కోరినా పవన్ ఖండించలేదని మాధవ్ విమర్శించారు.మాతో జనసేన అధినేత పవన్ కలిసి రావడం లేదనేది మా ఆరోపణ అంటూ మాధవ్ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై బిజెపి ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు.ఏపీలో వైసిపి కి జనసేన బిజెపి లే ప్రత్యామ్నాయంగా ప్రజలు చూస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.జనసేనతో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే జాతీయ నాయకత్వంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుకోవచ్చు అని అన్నారు.ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థికి పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
అసలు మాధవ్ ఏ ఉద్దేశంతో ఈ రకంగా స్పందించారో తనకు తెలియదంటూ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు.







