ఏపీలో జగన్ పరిపాలన జనరంజకంగా సాగుతుండడంతో పాటు కేంద్రంతో తమకు సంబంధం లేదన్నట్లుగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ జగన్ ముందుకు వెళ్తుండడం బీజేపీకి ఆగ్రహం తెప్పిస్తోంది.అందుకే వీలున్నప్పుడల్లా వైసీపీ పై విమర్శలు చేస్తున్నా, తమను లెక్క చేయడం లేదని బాధ బిజెపి అగ్ర నాయకుల్లో స్పష్టంగా ఉంది.
ఏపీలో తాము సొంతంగా ఎదగాలంటే వైసీపీని తీవ్రస్థాయిలో టార్గెట్ చేసుకోవడమే ఏకైక ఆప్షన్ అనే భావనలో బిజెపి నాయకులు ఉన్నారు.తాజాగా ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటుపై వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చూస్తోంది.
అదేవిధంగా రాజధానిపై జగన్ చేసిన ప్రకటనను కూడా తప్పు పడుతోంది.ఇప్పటికే అమరావతిలో భూములు సేకరించి అధికారికంగా అమరావతిని రాజధానిగా ప్రకటించడం, రాష్ట్ర ప్రజలందరూ కూడా దాదాపుగా అమరావతిని రాజధానిగా ఫిక్స్ అయిన నేపథ్యంలో ఆకస్మాత్తుగా రాజధానిని ఎలా తరలిస్తారని బిజెపి ప్రశ్నిస్తోంది.
రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులకు అన్యాయం చేస్తున్నారంటూ తప్పు పడుతోంది.అమరావతి పరిసర ప్రాంత ప్రజలు చేస్తున్న ఆందోళన, నిరసన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు బిజెపి పరిశీలిస్తోంది.
ఇదే సరైన సమయంగా భావించి జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు రాష్ట్రానికి నిధులు విడుదల విషయంలో కఠినంగా వ్యవహరించాలని బిజెపి చూస్తోంది.ఇప్పటికే కేంద్రం, రాష్ట్రాల మధ్య విద్యుత్ ఒప్పందాలపై విషయంలో మనస్పర్థలు ఉన్నాయి.
అదే కాకుండా ఇటీవల ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు ఇష్టం లేని మనీష్ కుమార్ ను జగన్ నియమించడంతో బిజెపి గుర్రుగా ఉంది.

అలాగే పోలవరం ప్రాజెక్ట్ పైన ఎన్నో వివాదాలు కొనసాగుతున్నాయి.రాజధాని నిర్మాణం పై ఇచ్చిన రిపోర్టును కూడా బిజెపి తప్పు పడుతోంది.కేంద్రాన్ని కనీసం సంప్రదించకుండా మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు అంటూ మండిపడుతోంది.
ఇప్పటికే ఏపీ పీకల్లోతు అప్పుల్లో ఉండడంతో ముందు ముందు రాష్ట్రానికి నిధులు, పరిశ్రమలు రాకుండా చేస్తే జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాల పథకానికి నిధుల కొరత ఏర్పడి జగన్ ఇబ్బంది పడతారని బీజేపీ భావిస్తోంది.ఈ విధంగా చేయడం ద్వారా ముందు ముందు జగన్ పరిపాలనపై వ్యతిరేకత వ్యక్తమవుతుందని, అది తమకు కలిసి వస్తుందని బిజెపి ఆలోచన.