మనం ఇళ్ళల్లో చిన్నపిల్లలకు అట్టహాసంగా బారసల చేయడం చూసాం.కానీ మచిలీపట్నం కు చెందిన ఓ కుటుంబం ఆవు దూడకు అంగరంగ వైభవంగా బారసల నిర్వహించి మూగజీవాల పై తమకున్న అమితమైన ప్రేమను చాటుకున్నారు.
దూడకు హారతులు ఇచ్చి, ఉయ్యాలలో వేసి ఉయ్యాల ఊపుతూ, దానికి ఇష్టమైన ఆహార పదార్ధాలు తినిపిస్తూ బంధు మిత్రుల సమక్షంలో ఆనందంగా బారసల జరుపుకున్నారు.
మచిలీపట్నం మంగినపూడి బీచ్ రోడ్డు గోపవానిపాలెంలో మైధిలి అనే మహిళ నివాసం ఉంటున్నారు.
ఆమె గత పదేళ్లుగా ఆవును పోషిస్తున్నారు.ఆ ఆవు పేరు బంగారం.
తన సొంత బిడ్డలను ప్రేమ, అప్యాయతతో అపురూపంగా ఏ విధంగా పెంచారో, అదే మాదిరిగా గోవులను పెంచుతున్నారు.ఆమె ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఆవు బంగారం ఆగష్టు 1వ తేదీన దూడను ప్రసవించింది.
తమ పిల్లలకు బారసాల చేసిన విధంగానే దూడకు నిన్న ఘనంగా బారసాల నిర్వహించారు.ఆ దూడకి లక్ష్మీ అని నామకరణం చేశారు.
బంధువులు, మిత్రులు, చుట్టుప్రక్కల ముత్తదైవులను పిలిచి సంప్రదాయ పద్దతిలో పూజలు నిర్వహించారు.దూడను ఉయ్యాల్లో పడుకోపెట్టి పాటలు పాడుతూ హరతులు ఇచ్చి అట్టహాసంగా బారసాల చేశారు.
ఈ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరు అ మూగజీవం పట్ల ప్రేమను చూపిస్తు వేడుక కోసం తయారుచేయించిన పలు రకాలు స్వీట్లు, పండ్లు దూడకు తినిపించారు.గత ఏడాది బంగారం అవుకి పుట్టిన సీత అనే దూడకి ఇదే విధంగా బారసాల నిర్వహించారు.
సొంత కుటుంబ సభ్యులను విస్మరించే ఈ రోజుల్లో మూగజీవాల పట్ల ప్రేమను చూపించటం పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.







