అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్ తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే.గందరగోళ పరిస్థితులు, తొక్కిసలాట కారణంగా 8 మంది మరణించగా… దాదాపు 300మందికి పైగా క్షతగాత్రులయ్యారు.
తాజాగా ఈ ఘటనలో భారత సంతతికి చెందిన 22 ఏళ్ల విద్యార్ధిని బ్రెయిన్ డెడ్ అయినట్లుగా అధికారులు ప్రకటించారు.టెక్సాస్ అగ్రికల్చరల్ అండ్ మెకానికల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న భారతీ షహానీ.
అస్ట్రోవరల్డ్ ఫెస్టివల్‌కు హాజరై అక్కడ జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డారు.అనంతరం సహాయక బృందాలు ఆమెను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ భారతీ బ్రెయిన్ డెడ్ అయినట్లుగా అధికారులు ప్రకటించారు.
భారతి ఆమె సోదరి నమ్రతా షహానీ, కజిన్ మోహిత్ బెల్లానీ కలిసి మ్యూజిక్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు వెళ్లారు.అయితే ప్రేక్షకులు వేదికపైకి చొచ్చుకురావడంతో వీరు ముగ్గురు చెల్లాచెదురవ్వడంతో పాటు మొబైల్ ఫోన్‌లను పొగొట్టుకున్నారు.
అయితే మిగిలిన ఇద్దరికి భారతి కనిపించలేదు.కొద్దిసేపటి తర్వాత ఊపిరి తీసుకోలేని స్థితిలో ఆమె కనిపించడంతో హుటాహుటిన హ్యూస్టన్ మెథడిస్ట్ ఆసుపత్రికి తరలించారు.
మార్గమధ్యంలో భారతి పలుమార్లు గుండెపోటుకు గురైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు.ఇక ఈ తొక్కిసలాటలో ప్రాణాలను కోల్పోయిన వారిని జాకబ్ జురినెక్ (21), జాన్ హిల్గర్ట్ (14), బ్రియానా రోడ్రిగ్జ్ (16), ఫ్రాంకో పాటినో (21), ఆక్సెల్ అకోస్టా (21), రూడీ పెనా (23), మాడిసన్ డుబిస్కీ (23), డానిష్ బేగ్ (27)లుగా గుర్తించారు.

ఇక ఈ విషాదంపై సింగర్ ట్రావిస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆస్ట్రోవరల్డ్ ఫెస్టివల్ వల్ల తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు.ఈ క్లిష్ట సమయంలో హ్యూస్టన్ కమ్యూనిటీతో కలిసి పనిచేస్తానని ట్రావిస్ చెప్పారు.ఘటన జరిగిన వెంటనే స్పందించిన హ్యూస్టన్ పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, ఎన్ఆర్‌జీ పార్క్ అధికారులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో భాగంగా ప్రముఖ అమెరికన్ ర్యాప్ సింగర్ ట్రెవిస్ స్కాట్ స్టేజిపైకి రాగానే జనం ఒక్కసారిగా వేదికపై కు దూసుకెళ్లారు.దీంతో అందరూ భయాందోళనకు గురయ్యారు.
బయటకు వెళ్లేందుకు పరుగులు తీస్తున్న క్రమంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.ఇదే క్రమంలో తొక్కిసలాట జరిగిందని అధికారులు వెల్లడించారు.