దేశం లో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్ ను కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నప్పటికీ రోజు రోజుకు ఈ కరోనా కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.దీనితో ప్రభుత్వ,ప్రయివేట్ సంస్థల ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే విధంగా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసాయి.
అయితే రోజు రోజుకు ఈ కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో లాక్ డౌన్ ను విధించాయి.తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చాయి.
ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి సుప్రీంకోర్టు న్యాయవాదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ వాదనలు వినిపించాలని సూచించింది.
ఇకపై న్యాయవాదులు నేరుగా కోర్టుకు వచ్చి వాదించాల్సిన అవసరం లేదని, అత్యవసర కేసులకు సంబంధించి న్యాయవాదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే తమ వాదనలు వినిపించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, న్యాయవాదులకు కొన్ని లింకులు ఇస్తామని, ఆ లింకుల ద్వారా వీడియో కాల్స్ కనెక్ట్ చేసుకోవచ్చని సీజేఐ తెలిపారు.
స్కైప్ ద్వారాగానీ, మరేఇతర సాధనాల ద్వారాగానీ లాయర్లు తమ వాదనలు వినిపించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.అలానే మరోపక్క కోర్టు భవనంలోని లాయర్ల చాంబర్లు అన్నింటిని కూడా సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి మూసివేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

కోర్టులో లాయర్లకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్లు ఏవైనా ఉంటే మంగళవారం సాయంత్రానికల్లా తీసుకెళ్లాలంటూ సూచించింది.ఈ కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా 11 వేల మందికి పైగా మృతి చెందగా,3 లక్షలకు పైగా ప్రజలు కరోనా పాజిటివ్ తో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.రోజు రోజుకు ఈ కరోనా తీవ్రత మరింత పెరుగుతుండడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తుంది.