వైసీపీకి కర్త, కర్మ, క్రియ అన్నీ జగన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పార్టీ పరంగా తీసుకునే ఏ నిర్ణయం అయినా జగన్ చేతుల్లోనే ఉంటుంది.అయితే ఒక్కోసారి జగన్ తీసుకున్న నిర్ణయాలు బూమరాంగ్ అవుతుంటాయి.2014లో చివరి నిమిషంలో టీడీపీలోకి ఫిరాయించిన రఘురామకృష్ణంరాజును 2019 ఎన్నికల సమయంతో తిరిగి పార్టీలోకి చేర్చుకుని ఆయనకు నర్సాపురం ఎంపీ టిక్కెట్‌ను జగన్ కట్టబెట్టారు.అయితే ప్రస్తుతం వైసీపీకి రఘురామ పంటి కింద రాయిలా తగులుతున్నారు.
ఇదే తరహాలో ఇప్పుడు రాజ్యసభ సీటు కట్టబెట్టిన ఆర్.
కృష్ణయ్య నుంచి కూడా వైసీపీకి సమస్యలు తప్పవని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.ఆర్.కృష్ణయ్య తెలంగాణ వాసి అని తెలిసినా.ఈ విషయంలో విమర్శలు వస్తాయని తెలిసినా జగన్ మొండిధైర్యంతో ముందడుగు వేశారు.
అయితే ఆర్.కృష్ణయ్య రాజకీయ జీవితం పరిశీలిస్తే ఆయన ఏ పార్టీలోనూ నిలకడగా ఉన్న దాఖలాలు లేవు.కొన్నాళ్లు టీడీపీలో.మరికొన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన తాజాగా రాజ్యసభ సీటు ఇచ్చారు కాబట్టి జగన్‌కు భజన చేస్తున్నారు.
ఆర్.కృష్ణయ్యకు ఉన్న బీసీ కార్డు తెలంగాణ ఎన్నికల్లోనే తుస్సుమన్న వేళ ఏపీలో ఏ విధంగా బీసీల ఓట్లను సాధించగలరు అన్న ప్రశ్న వైసీపీ నేతల్లో ఉత్పన్నం అవుతోంది.మూడు పార్టీలు ఆరు అభిప్రాయాలు కలిగి ఉండే ఆర్.కృష్ణయ్య రాజ్యసభలో తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా ఆర్.కృష్ణయ్య వ్యతిరేకిస్తారని అది ఏపీలో వైసీపీకి సమస్యగా మారుతుందని పలువురు భావిస్తున్నారు.

మరోవైపు రాజ్యసభ ఎంపీగా ఉన్న బీద మస్తాన్‌రావుతోనూ జగన్‌కు సమస్యలు తప్పవని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.2024 ఎన్నికల్లో జగన్ కనుక మళ్లీ అధికారంలోకి రాకపోతే బీద మస్తాన్ రావు టీడీపీలో చేరిపోయినా ఆశ్చర్యం లేదని వైసీపీ నేతలే అంటున్నారు.తెలంగాణలో కేసీఆర్ కూడా డీఎస్‌ను రాజ్యసభకు పంపి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు నుంచి వైసీపీకి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.