అటు తిరిగి ఇటు తిరిగి ఏపీ రాజకీయం గవర్నర్ కోర్ట్ కి వచ్చి చేరింది.అసలు పరిపాలనా వ్యవహారాల్లో కానీ, రాజకీయ అంశాల విషయంలో కానీ, గవర్నర్ పాత్ర పరిమితంగానే ఉంటుంది.
పెద్దగా గవర్నర్ తో సంబంధం లేదన్నట్లుగానే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తాయి.కానీ ఇప్పుడు ఏపీ ఈ విషయంలో గవర్నర్ కు గట్టి పనే తగిలినట్టుగా కనిపిస్తోంది.
వైసిపి టిడిపి మధ్య మొదలైన రాజకీయ పోరు కాస్తా, వివాదాస్పదం అవడం, అనేక సంచలన నిర్ణయాలు ఏపీ ప్రభుత్వం తీసుకోవడం, అవి కోర్టుల్లోనూ, అక్కడి నుంచి గవర్నర్ నిర్ణయం తీసుకునే వెళ్లడంతో ఏపీ రాజకీయ అంశాలు ఆసక్తికరంగా మారాయి.ముఖ్యంగా పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు, ఎన్నికల అధికారిగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం, ఇవన్నీ ఇప్పుడు గవర్నర్ కోర్టుకు వచ్చి చేరాయి.
ఈ వ్యవహారంలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.ముఖ్యంగా సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల వ్యవహారం గవర్నర్ ఆమోదిస్తారా లేదా అనే సందిగ్ధంలో అధికార పార్టీ ఉండగా, ఎట్టిపరిస్థితుల్లోనూ దానిని ఆమోదించవద్దని తెలుగు దేశం పార్టీ ఇప్పటికే గవర్నర్ కు లేఖ రాసింది.
ఈ పరిస్థితుల్లో కేంద్రం లేదా రాష్ట్రపతి సలహా తీసుకుని గవర్నర్ నిర్ణయం తీసుకుంటారా ? అసలు ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.అలాగే మాజీ ఎన్నికల అధికారి రమేష్ కుమార్ పంచాయతీ కూడా గవర్నర్ వద్దకు చేరింది.
ఈ విషయంలో అదే ఉత్కంఠ ఉంది.గతంలో నిమ్మగడ్డను తప్పించి మరో వ్యక్తిని ఎన్నికల అధికారిగా నియమించిన విషయం లో గవర్నర్ ఆమోదం తెలిపారు.

మళ్లీ ఈ వ్యవహారం కోర్టుకు చేరడం, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్ పై పడడంతో, ఆయన నిర్ణయం ఏంటనేది తేలాల్సి ఉంది.ఇప్పటికే హైకోర్టు నిమ్మగడ్డను గవర్నర్ ను కలవాల్సిందిగా సూచించడంతో నిమ్మగడ్డకు ఈరోజు 11.30 నిమిషాలకు అపాయింట్మెంట్ లభించింది.ఇప్పుడు ఆయన విషయంలో గవర్నర్ నిర్ణయం ఏంటనేది మరికొద్ది గంటల్లోనే తేలిపోతుండడంతో, ఆ తర్వాత సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లు వ్యవహారంలో కూడా గవర్నర్ అభిప్రాయం ఏ విధంగా ఉంది అనేది తేలిపోతుంది.

అందుకే వైసిపి టిడిపి, మిగతా రాజకీయ పార్టీలన్నీ ఈ విషయంలో గవర్నర్ నిర్ణయం కోసం టెన్షన్ గా ఎదురుచూస్తున్నాయి.నిమ్మగడ్డ విషయంలో క్లారిటీ లేకపోయినా, మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు విషయంలో కేంద్రం కూడా అనుకూలంగా ఉండడంతో, గవర్నర్ ఆ మేరకు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.