కరోనా వైరస్ ప్రభావం ఎంత తీవ్రస్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే.ప్రజలంతా లాక్ డౌన్ కారణంగా పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు.
ఈ ఇబ్బందులు తాత్కాలికమే అయినా ప్రస్తుతం ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం.ప్రజలంతా చాలా రోజులుగా ఇళ్లకే పరిమితం అయిపోవడంతో ఎన్నో రకాల సంజీలను అనుభవిస్తున్నారు.
ప్రభుత్వం నుంచి అర కొర సహాయం అందుతున్నా, ప్రజలు పడుతున్న సాధక బాధలు అన్నీ ఇన్ని కావు.అయితే ప్రజలు అంతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వారికి భరోసా కల్పించాల్సిన ఏపీ మంత్రులు మాత్రం ప్రజల సాధక బాధలను వినే పరిస్థితుల్లో లేనట్టుగా వ్యవహరిస్తున్నారు.
కేవలం కొంతమంది మంత్రులు మాత్రమే ప్రజల్లో తిరుగుతున్నా, మిగతా వారు మాత్రం తమకేమి పట్టనట్టుగా ఇళ్లకే పరిమితమైపోతున్నారు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ ఉండడంతో మంత్రులు పర్యటనలు, సమావేశాలు నిర్వహించేందుకు అవకాశం లేకపోయినా కనీసం అధికారులతో ఇంటి నుంచే సమీక్షలు చేసే అవకాశం ఉన్నా, వారు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ప్రస్తుతం కరోనా కారణంగా ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తున్నారు.ఇక మంత్రులు అయితే కరోనా భయంతో మరింత దూరంగా ఉంటున్నారు.
మంత్రుల్లో ఎక్కువ శాతం మంది ఇళ్లకే పరిమితం అయిపోవడంతో ప్రజలను పట్టించుకునే వారు కనిపించడం లేదు. ఏపీ మంత్రులు సుమారు 25 మంది వరకు ఉన్నా, వాళ్ళల్లో యాక్టివ్ గా ఉన్నవారు నలుగురైదుగురుకి మించి కనిపించడం లేదు.

మిగతావారంతా ఇళ్ల కే పరిమితం అయిపోయారు.మంత్రి కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్ వంటి వారు మాత్రమే యాక్టివ్ గా ఉంటూ కరోనా సమీక్షలు చేస్తూ, అధికారులకు సూచనలు ఇస్తూ, కనిపిస్తున్నారు.అతి కీలకమైన పోర్ట్ పోలియో నిర్వహిస్తున్న హోంమంత్రి మేకతోటి సుచరిత పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు.ఇక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత కూడా ఇంటికే పరిమితమైపోయారు.
రాష్ట్రంలో మహిళలకు సంబంధించి సమస్యల మీద ఆమె ఇంటి అధికారులతో సమీక్షలు చేసే అవకాశం ఉన్నా, ఆమె మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు.ఇక ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కూడా ఇదేవిధంగా వ్యవహరిస్తున్నారు.

మరో మంత్రి గౌతంరెడ్డి కూడా ఇంటికి పరిమితమయ్యారు.నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మొదట్లో కాస్త హడావుడి గా ఉన్నట్లు కనిపించినా, ఆయన ఇప్పుడు యాక్టివ్ గా కనిపించడం లేదు.ఇక తెలుగుదేశం పార్టీ పైన, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, ఎప్పుడూ వార్తల్లో ఉండే పౌరసరఫరాల శాఖ మంత్రి ఆళ్ల నాని రెండు రోజుల క్రితం మీడియా సమావేశం నిర్వహించి పాత తరహా లోనే చంద్రబాబును, తెలుగుదేశం పార్టీ నాయకులను తనదైన శైలిలో తిట్లదండకం అందుకుని సైలెంట్ అయిపోయారు.

ఇక ఎలాగూ ఏపీ సీఎం జగన్ మీడియా సమావేశాలు నిర్వహించేందుకు ఇష్టపడటం లేదు.అసలు కరోనాకు సంబంధించి జగన్ కీలక నిర్ణయాలు ఏమేమి తీసుకుంటున్నారు ? ఏవిధంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నారు అనే వివరాలు ప్రజలకు పూర్తి స్థాయిలో తెలియకపోవడంతో ఏపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది.ఇదే అదునుగా ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ హడావుడి చేస్తూ కరోనాను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉంది.