కులం ! ఈ మాట ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎక్కువగా వినిపించే మాట.రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఆయా కులాల మద్దతు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటాయి.అడిగినా… అడగకపోయినా కులాల వారీగా లబ్ధి చేకూర్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటాయి.కులాల వారీగా సభలు… సమావేశాలు నిర్వహిస్తూ… వారిని ఆకట్టుకునేందుకు అనేక అనేక హామీలు ఇస్తుంటాయి.
ఏ కులం మద్దతు ఎక్కువగా ఉంటే అధికారం దక్కుతుందో… ముఖ్యంగా ఆ కులాన్ని నెత్తిన పెట్టుకునేందుకు రాజకీయ నాయకులు చూస్తుంటారు.ప్రస్తుతం ఏపీ లో ఎన్నికలకు ఇంకా రెండు నెలలు కూడా సమయం లేకపోవడంతో రాజకీయ పార్టీలు కులాల వారీగా ప్రజలను ఆకట్టుకునేందుకు చూస్తున్నాయి.

ఇప్పటికే వైసిపి బీసీలను ఆకట్టుకునేందుకు బీసీ గర్జన నిర్వహిస్తుండగా… తెలంగాణ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా బీసీ యాదవ గర్జన పేరుతో మరో సభ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.అధికార పార్టీ టిడిపి అయితే ఇప్పటికీ జయహో బిసి అంటూ సభను నిర్వహించి బీసీలు మద్దతు పొందేందుకు యత్నించింది.ప్రధానంగా టిడిపి, వైసిపి, జనసేన పార్టీల అధినేతలు మూడు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో… ఎవరికి వారు తమ సామాజిక వర్గం ఓట్లను గంపగుత్తగా పొందేందుకు …ప్రత్యర్థి పార్టీల అధినేతల సామాజిక వర్గాల ఓట్లను చీల్చేందుకు అనేక ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు.గత ఎన్నికల్లో కేవలం రెండు శాతం ఓట్లతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించగా… వైసిపి పరాజయం పాలయింది.
అయితే ఆ రెండు శాతం ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం తో కాపు సామాజిక వర్గం ఓట్లు టిడిపికి ఎక్కువగా పడినట్టు తేలింది.

అయితే ప్రస్తుతం టిడిపి అదే కాపు సామాజిక వర్గం భారీగా పొందేందుకు కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అంటూ హడావుడి చేస్తోంది.దీంతో ఆ సామాజిక వర్గం మొత్తం టిడిపి వైపు చూస్తారని ఆ పార్టీ భావిస్తోంది.ఇక వైసీపీ అధినేత జగన్ కూడా ప్రధానంగా కాపు సామాజిక వర్గం ఓట్లు పైనే ప్రస్తుతం దృష్టి పెట్టాడు.
అందుకే రాజకీయంగా ప్రభావితం చేయగలిగే బలమైన కాపు సామాజిక వర్గం నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.దీనిలో భాగంగానే ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి టిడిపి ఎంపీ అవంతి శ్రీనివాస్ లను పదవులకు కూడా రాజీనామా చేయించి మరి పార్టీలో చేర్చుకున్నాడు జగన్.
అంతే కాకుండా… ఉభయగోదావరి జిల్లాల్లో ప్రధానంగా ఉండే ఈ సామజిక వర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు కీలకమైన నేతలను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు తెరవెనుక రాజకీయం మొదలు పెట్టడంతో ఆయా కులాల్లో ఉన్న చిన్న చితక నాయకులకు కూడా ఇప్పుడు ఎక్కడ లేని ప్రాధాన్యత పెరిగిపోయింది.







