కొంతమందికి పేరులో ‘గాంధీ’ ఉంటుంది.కాన పరమ దుర్మార్గులుగా ఉంటారు.
పేరులో గాంధీ లేకపోయినా ఆయన్ని గుర్తుకు తెచ్చే సంఘ సేవకుడు, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే.స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ తరచుగా నిరాహార దీక్షలు చేసేవారు.
అదే బాటలో నడిచే అన్నా హజారే కూడా మరోసారి ‘ఆమరణ నిరాహార దీక్ష’ తలపెట్టారు.యూపీఏ హయాంలో జన లోక్‌పాల్ బిల్లు కోసం ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుని దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలుసు.
ఇప్పుడు రెండు అంశాలపై నిరాహార దీక్ష చేయబోతున్నారు.వివాదాస్పద భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా, సైన్యానికి సంబంధించిన ఒన్ ర్యాంక్-ఒన్ పెన్షన్ అమలు చేయనందుకు నిరసనగా అక్టోబరు రెండో తేదీ నుంచి అంటే గాంధీ జయంతి నుంచి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు.
దీనికి రామ్‌లీల మైదానం వేదిక కాబోతున్నది.మోదీ సర్కారు భూసేకరణ బిల్లుపై చూపిస్తున్నంత శ్రద్ధ, ఒన్ ర్యాంక్-ఒన్ పెన్షన్ విధానం అమలు చేయడానికి చూపడంలేదని హజారే విమర్శించారు.
హజారే పదిహేనేళ్లు సైన్యంలో పనిచేసిన సంగతి చాలామందికి తెలుసు.ఒన్ ర్యాంక్-ఒన్ పెన్షన్ విధానం ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టమైన తేదీ ప్రకటించాలని మాజీ సైనికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
తన నిరాహార దీక్ష గురించి చాలా ముందుగానే అన్నా హజారే ప్రకటించారంటే సర్కారుకు హెచ్చరిక చేయడానికే కావొచ్చు.త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో భూసేకరణ బిల్లు మీద ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు వ్యూహాలు పన్నుతున్నాయి.
హజారే నిరాహార దీక్ష ప్రారంభిస్తే ప్రతిపక్షాలు ఆయనకు మద్దతు ఇస్తాయి.







