ఎర్రగా నిగనిగలాడుతూ ఉండే లిచి పండ్లు ఈ మధ్య కాలంలో రోడ్డు పక్కన ఎక్కువగా అమ్ముతున్నారు.అయితే వీటి గురించి చాలా మందికి తెలియదు.
ఈ పండ్ల వాడకం ఈ మధ్యనే పెరిగింది.ఈ పండ్లు ఎక్కువగా చైనాలో పండుతాయి.
ఈ పండ్లను తినటం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే మీరు కూడా ఆ పండ్లను కొని తినటం ప్రారంభిస్తారు.
ఈ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉండుట వలన ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడటమే కాకుండా రక్తంలో తెల్లరక్త కణాలు పెరగటానికి సహాయపడి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఈ పండును తింటే ఈ పండులో ఉండే డైటరీ ఫైబర్ విరేచనం సాఫీగా అయ్యేలా చేసి మలబద్దకం సమస్యను తరిమికొడుతుంది.అంతేకాకుండా మనం తీసుకొనే ఆహారంలోని పోషకాలు శరీరం గ్రహించేలా చేస్తుంది.
అధిక రక్తపోటు ఉన్నవారికి ఈ పండు చాలా మంచిది.ఈ పండులో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన అధిక రక్తపోటును తగ్గించి రక్త సరఫరాను మెరుగుపరచి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
లిచి పండ్లలో కాపర్, ఐరన్‌లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో ఎర్ర రక్తకణాలను పెంచటంలో సహాయపడుతుంది.రక్తహీనతతో బాధపడేవారికి ఈ పండు ఒక వరమని చెప్పాలి.
లిచి పండ్లలో ఉండే ఫైబర్ కొవ్వును కరిగించేందుకు దోహదపడుతుంది.కాబట్టి బరువు తగ్గాలని అనుకొనే వారికి బాగా సహాయపడుతుంది.