“కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా నేను నిద్రపోను.ముఖ్యమంత్రి చంద్రబాబును నిద్రపోనివ్వను.
ఎన్నికల ముందు చంద్రబాబు కాపులకు హామీ ఇవ్వడం వల్లే మేం రోడ్డెక్కాం.రూ.500 కోట్లు తక్షణం ఇస్తామని, వచ్చిన దరఖాస్తులన్నింటినీ క్లియర్ చేసామన్నారు.వాటి గురించి పట్టించుకోకపోవడం వల్లే మళ్లీ దీక్ష చేపట్టాల్సిన పరిస్థితి వస్తోంది” అని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం శపథం చేశారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఈనెల 10వ తేదీ వరకు డెడ్‌లైన్ విధించారు.హామీలు నెరవేర్చకపోతే ఈనెల 11వ తేదీ నుంచి మళ్లీ ఆమరణ దీక్ష చేపడతానని ప్రకటించారు.
శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో ముద్రగడ విలేకరులతో మాట్లాడారు.
కాపుల కోసం స్వేచ్ఛగా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.దీక్షను భగ్నం చేస్తే పరిస్థితి రెండు రకాలుగా ఉంటుందని హెచ్చరించారు.‘ఈనెల 11వ తేదీ ఉదయం 10 గంటలకు నా ఇంట్లో, నేను ఒక్కడినే ఆమరణ దీక్ష చేపడతాను’ అని తెలిపారు.
తన సతీమణి ఆరోగ్యం బాగాలేనందున ఆమె దీక్ష చేపట్టడంలేదని ముద్రగడ చెప్పారు.పచ్చ చొక్కాల వారికి మాత్రమే రుణాలు ఇస్తామని చెప్పడం తప్పు అని అన్నారు.కాపులకు రూ.40 వేల నుంచి రుణాలు ఇస్తామంటున్నారంటూ… ‘‘ఇది మీ యువరాజా వారి చెప్పుల ఖరీదంత కూడా లేదే? ఇదెలా సరిపోతుంది!’’ అని ప్రశ్నించారు.దీక్ష సమయంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ నాయకుడు కళా వెంకట్రావు తనకు లిఖిత పూర్వకంగా రాసిచ్చిన హామీలు ఇంతవరకు అమలు చేయలేదని ముద్రగడ పద్మనాభం అన్నారు.ఈ విషయంలో ప్రభుత్వ రాయబారుల మాట నమ్మి పూర్తిగా మోసపోయాం’’ అని ముద్రగడ వివరించారు.







