టాలీవుడ్‌ను మల్టీస్టారర్ చిత్రాలు ముంచెత్తుతున్నాయి.ఇదే వారంలో మంచు హీరో విష్ణు మరియు యువ హీరో రాజ్ తరుణ్‌లు కలిసి ఒక సినిమాలో నటించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.
అది సెట్స్ పైకి వెళ్లకుండానే మరో మల్టీస్టారర్ సినిమాకు రంగం సిద్దం అయ్యింది.నారా హీరో రోహిత్, అవసరాల శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ‘జ్యో అచ్చుతానంద’ అనే చిత్రంలో మరో హీరోగా నాగశౌర్య నటించబోతున్నాడు.
అయితే నారా రోహిత్ ఈ సినిమాకు ప్రధాన హీరోగా కనిపించనుండగా, నాగ శౌర్య మాత్రం 25 నుండి 30 నిమిషాలు కనిపిస్తాడట.
నాగశౌర్యకు సక్సెస్‌ను తెచ్చి పెట్టిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రాన్ని నిర్మించిన సాయి కొర్రపాటి మరియు దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా అవ్వడం వల్లే చిన్న పాత్ర అయినా ‘జ్యో అచ్చుతానంద’ చిత్రంలో నటించేందుకు ఈ కుర్ర హీరో ఓకే చెప్పాడు.
మరో వైపు ఈయన మెగా హీరోయిన్ నిహారికకు జోడీగా ‘ఒక మనస్సు’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఇప్పటికే ఈయన నటించి షూటింగ్ పూర్తి అయిన ‘కళ్యాణ వైభోగమే’ విడుదలకు సిద్దంగా ఉంది.
ఇక నారా రోహిత్, నాగశౌర్యల కాంబోలో మూవీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.







