దేశంలో తీరని సమస్యలు ఉండాల్సిందే.సమస్యలు ఉంటే ప్రజలు ఇబ్బంది పడతారు కదా.
నిజమే … కాని సమస్యలు ఉంటేనే రాజకీయ నాయకుల్లో క్రియేటివిటీ పెరుగుతుంది.వినూత్నమైన నిరసన కార్యక్రమాలు ప్లాన్ చేస్తారు.
వారి బుర్రలు చురుగ్గా పనిచేస్తాయి.ఏపీ కాంగ్రెస్ నాయకులు తమ బుర్రలకు పదును పెట్టి కొత్త నిరసన కార్యక్రమం ప్రారంభించారు.
దాని పేరే మట్టి సత్యాగ్రహం.అంటే ఏపీ నుంచి మట్టి సేకరించి ప్రధాని మోడీ కార్యాలయానికి పంపడం.
అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన మోడీ పార్లమెంటు మట్టి, యమున నీరు తెచ్చి బాబుకు ఇచ్చి వెళ్ళిపోయారు తప్ప ప్రత్యేక హోదా మీద గాని, ప్యాకేజీ గురించి గానీ ప్రకటన చేయక పోవడంతో ఏపీలో నిరసనలు పెల్లుబుకుతున్నాయి.అందులో భాగమే మట్టి సత్యాగ్రహం.
ఈ నిరసన వల్ల హోదా రాదనే విషయం కాంగ్రెస్ నాయకులకు తెలుసు.కానీ నిరసన తెలియ చేయడం ధర్మం.
దీన్ని పేరడీ నిరసన అనొచ్చు.అంటే చంద్రబాబు చేసిన మన మట్టి – మన నీరు కార్యక్రమానికి కాపీ అన్న మాట.కాకపోతే అది పాజిటివ్.ఇది నెగెటివ్.
బాబు ఎపీలోని, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మట్టి తెప్పించినట్లే కాంగ్రెస్ నాయకులు కూడా రాష్ట్రంలోని 16,000 గ్రామాలు, 3,000 మునిసిపల్ వార్డుల నుంచి మట్టి సేకరిస్తున్నారు.అలాగే దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర పవిత్ర స్థలాల నుంఛి మట్టి సేకరించి ప్రధాని కార్యాలయానికి పంపుతారు.
ఈ నిరసన కార్యక్రమాన్ని 1930లో గాంధీజీ నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహంతో పోలుస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.







