తెలంగాణా ఉద్యమంలో చురుకుగా పని చేసిన తెలంగాణా రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం రాష్ట్రం ఏర్పడిన తరువాత అంత చురుకుగా పనిచేయడం లేదని విమర్శలు వచ్చాయి.ముఖ్యమంత్రి కెసీఆర్ నియంతగా వ్యవహరిస్తున్నా, రైతుల ఆత్మహత్యలను పట్టించుకోక పోయినా కోదండ రామ్ నిలదీయడంలేదని కొందరు అన్నారు.
ఆ విమర్శలకు జవాబుగా అన్నట్లు రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నిస్తూ కోదండరామ్ హై కోర్టులో పిటిషన్ వేసారు.ప్రభుత్వం స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయలేదని పేర్కొన్నారు.
ప్రభుత్వ విధానాల కారణంగా రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని తెలిపారు.ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలను కూడా ప్రస్తావించారు.
ఒక్క వారంలోనే రెండు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు పెరిగాయన్నారు.హై కోర్టులో పిటిషన్ వేయడం సరైన చర్యే.
రైతుల ఆత్మహత్యలకు సంబంధించి తప్పుడు లెక్కలు చెబుతున్న సర్కారు హై కోర్టుకు అయినా సరైన లెక్కలు చెప్పాలి.ప్రభుత్వం సమర్పించే లెక్కలు సరైనవో కాదో కోర్టు నిర్ధారించుకోవాలి.
నష్ట పరిహారం ఇవ్వడానికి నిబంధనలు ఏమిటో కూడా బయట పెట్టాలి.







