తెలంగాణా అసెంబ్లీ బుధవారం రైతుల ఆత్మహత్యలు, వరంగల్ ఎన్కౌంటర్ ఘటనల మీద దద్దరిల్లిపోయింది.అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి.
ఆత్మహత్యలపై మంగళవారం మొదలైన చర్చ బుధవారం కొనసాగింది.వరంగల్ ఎదురు కాల్పులను, అందులో ఇద్దరు మావోయిస్టులు చనిపోవడాన్ని నిరసిస్తూ ప్రజాసంఘాలు తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం, నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధిచడంతో అసెంబ్లీలో దుమారం రేగింది.
ప్రశ్నోత్తరాల సమయం రద్దు చేసారు.ప్రతిపక్షాలు ఆత్మహత్యల మీద ప్రభుత్వాన్ని కడిగి పారేసాయి.
సభకు సహకరించాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రతిపక్షాలను కోరారు.ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు హరీష్ సమాధానం చెప్పడానికి ప్రయత్నించగా గందరగోళం ఏర్పడింది.
సమాధానాలు చెప్పాల్సింది హరీష్ రావు కాదని, ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేసారు.వరంగల్ ఎదురు కాల్పులపై చర్చ జరగాలని టీడీపీ పట్టుబట్టింది.
వికారుద్దీన్ ఎన్కౌంటర్ మీద కూడా చర్చ జరపాలని డిమాండ్ చేసింది.టీడీపీ సభ్యులను అరెస్టు చేయడం పై ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.
దీనికి సీఎమ్ కెసీఆర్ సమాధానం చెబుతూ అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రెండు రోజులు రైతు ఆత్మహత్యల మీద చర్చ కోసమే కేటాయించామని, ఇతర విషయాలు మాట్లాడ వద్దని అన్నారు.ప్రతిపక్షాలు ఎన్ని రోజులు కోరితే అన్ని రోజులు సభ నిర్వహిస్తామని చెప్పారు.







