'ఔట్‌లుక్‌' క్షమాపణ

పత్రికలకు ఏదైనా రాసే స్వేచ్ఛ ఉంది.కాని ఆ రాతల ద్వారా వ్యక్తుల, ఇంకా చెప్పాలంటే ప్రముఖుల గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించకూడదు.

 Outlook Expresses Regret Over Article ‘no Boring Babu’-TeluguStop.com

ఒకవేళ తెలిసో తెలియకో అలాంటి రాతలు లేదా కథనాలు రాసినట్లయితే బేషరతుగా క్షమాపణ చెప్పడం మంచి పద్ధతి.అత్యంత పాఠకాదరణ ఉన్న ప్రముఖ ఆంగ్ల న్యూస్‌ మేగజైన్‌ ‘ఔట్‌లుక్‌’ ఆ పనే చేసింది.

తెలంగాణ జిల్లాల్లో డైనమిక్‌ కలెక్టరుగా పని చేసి, ప్రజల ఆదరణ పొంది, ప్రస్తుతం సీఎం పేషీలో పనిచేస్తున్న యువ ఐఏఎస్‌ అధికారి స్మితా సభర్వాల్‌పై ‘ఔట్‌లుక్‌’ తన తాజా సంచికలో అభ్యంతరకర వ్యాసం రాసి, దానికి అసభ్యకరమైన క్యారికేచర్‌ వేసి స్మితను అవమానపరచడంతో దేశ వ్యాప్తంగా దుమారం రేగింది.అవమానానికి గురైన స్మిత, ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇతర అధికారులు పత్రికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.‘నో బోరింగ్‌ బాబు’ అనే శీర్షికతో ప్రచురించిన ఈ చిన్న కథనంతో పాటు దాని పక్కనే కార్టూన్‌ వేశారు.ఈ కార్టూన్‌లో స్మిత (క్యారికేచర్‌లో ఆమె పోలికలు లేవు) ఆధునిక దుస్తుల్లో ర్యాంపుపై (ఫ్యాషన్‌ షోలో) నడుస్తుంటే కేసీఆర్‌, మరో ఇద్దరు నాయకులు ఆనందంగా, తన్మయత్వంతో చూస్తుంటారు.

ఇతర బొమ్మల్లో ఎవరి పోలికలు లేకపోయినా కేసీఆర్‌ పోలీకలు మాత్రం స్పష్టంగా తెలుస్తున్నాయి.దాని పక్కన వేసిన ఆర్టికల్‌లో ఎవ్వరి పేర్లూ లేకపోయినా రాసిన తీరును బట్టి అది స్మిత సభర్వాల్‌ గురించేనని అర్థమవుతోంది.

అందంగా ఉండి చక్కటి చీరలు కట్టుకొని ఆకర్షణీయంగా ఉండే స్మిత ఆధునిక దుస్తులు ధరించి ఒక ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నారని రాశారు.రాతలో అభ్యంతరకరమైంది ఏమీ లేకపోయినా పక్కనవేసిన కార్టూన్‌ ‘ఔట్‌లుక్‌’ కొంప ముంచింది.

అందుకే ఇంత కథ నడిచింది.ఆ క్షమాపణలు చెప్పకుంటే పత్రికపై క్రిమినల్‌ కేసు వేస్తామని స్మిత హెచ్చరించారు.

దీంతో పత్రిక ఎడిటర్‌ క్షమాపణ చెప్పారు.కథనంలో ఎవ్వరి పేర్లూ రాయలేదని, ఉద్దేశపూర్వకంగా అవమానించాలని దీన్ని ప్రచురించలేదని చెప్పారు.

ఇది సెటైరికల్‌గా వేసిన ఆర్టికల్‌ అని, దీన్ని తేలిగ్గా తీసుకోవాలని అన్నారు.అయినప్పటికీ ఎవ్వరికైనా బాధ కలిగించి ఉంటే క్షమాపణ కోరుతున్నామన్నారు.

ఈ సమస్య ఇంతటితో సమసి పోయినట్లేనా?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube