టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రుద్రమదేవి’ ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.దాదాపు ఆరు నెలల క్రితం చిత్రీకరణ పూర్తి అయిన ఈ సినిమాను అనేక కారణాల వల్ల విడుదల వాయిదా వేయడం జరిగింది.
ఆ అనేక కారణాల్లో ఒక్కటి ఈ సినిమాకు బిజినెస్ కాకపోవడం.దాదాపు 70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను అమ్మేసేందుకు గుణశేఖర్ చాలా కష్టపడుతున్నాడు.
అన్ని ఏరియాల రైట్స్ కలిపినా కనీసం 40 కోట్లు రావడం లేదు.హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అవ్వడంతో పాటు ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాలేదనే టాక్ కావడంతో పెద్దగా డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపడం లేదు.
ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను 26న విడుదల చేయాలని నిర్ణయించిన గుణశేఖర్ కొన్ని ఏరియాల్లో తానే స్వయంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు.కొన్ని ఏరియాల్లో ఆశించిన స్థాయిలో కాకున్నా కాస్త అటు ఇటుగా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముడు పోయాయి.
అయితే కొన్ని ఏరియాలో మాత్రం గుణశేఖర్ ఆశించిన మొత్తానికి కనీసం సగం కూడా రావడం లేదు.దాంతో తప్పని పరిస్థితుల్లో సొంతంగానే విడుదల చేయబోతున్నాడు.
గుణశేఖర్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా రిస్క్ అంటున్నారు సినీ వర్గాల వారు.అయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ముందు మరే మార్గం లేక పోవడంతో గుణశేఖర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో రానా ముఖ్య పాత్రలో నటించాడు.







