తిరుపతి (శేషాచలం అడువుల్లో) ఎన్‌కౌంటర్ పోలీసులు చేసిన హత్యలేనని, నిజమైన ఎన్‌కౌంటర్ కాదని పౌర హక్కుల సంఘాలు, ప్రతిపక్షాలు చెబుతుండగా, అందుకు బలం చేకూర్చే కథనాలు వినవస్తున్నాయి.పేద కూలీలను పోలీసులు కాల్చిచంపారనే విమర్శలు ఎక్కువవుతుండగా, వారుకూలీల రూపంలో ఉన్న కర్కోటకులని పోలీసులు వాదిస్తున్నారు.
గతంలో అధికారులను చంపిన ఉదాహరణలు చెబుతున్నారు.ఇది నిజమైన ఎన్‌కౌంటరా? బూటకపు ఎన్‌కౌంటరా? అనేది విచారణలో తేలాల్సిందే.అది తేలేంతవరకూ అనేక వార్తలు వస్తూనే ఉంటాయి.కథనాలు వినపిస్తూనే ఉంటాయి.ఏపీ పోలీసులు ఇదివరలోనే అరెస్టు చేసిన ఏడుగురిని కూడా పట్టుకొచ్చి కాల్చేశారని తమిళనాడులోని ధర్మపురికి చెందిన ఓ వ్యక్తి ఆరోపించాడు.ఈ నిందితులు బస్సులో తిరుపతికి వస్తుండగా పోలీసులు దార్లోనే పట్టుకొని కాల్చేశారని చెప్పాడు.
ఈ ఆరోపణ చేసిన వ్యక్తి తండ్రి కూడా ఈ ఏడుగురిలో ఒకడు.ఇది నిజమైన ఎన్‌కౌంటర్ అయినట్లయితే, కూలీలు దాడికి దిగివుంటే ఒకరో ఇద్దరో చనిపోతారుగాని ఏకంగా ఇరవైమంది చనిపోతారా? అని పౌరహక్కుల సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.విచారణలో ఏం తేలుతుందో చెప్పలేంగాని ఈ భారీ ఎన్‌కౌంటర్ మాత్రం చంద్రబాబుకు ఓ మాయని మచ్చలా మిగిలిపోతుంది.







