రాజన్న సిరిసిల్ల జిల్లా : అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పట్టిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.
బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డుల జారీ, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
జనవరి 26 నుంచి నూతనంగా 4 ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సంబంధించి పాటించాల్సిన విధానాల పై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కాన్ఫరెన్స్ లో తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వం జారీ చేసిన గైడ్ లైన్స్ తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, రైతు భరోసా కు సంబంధించి అధికారులు వ్యవసాయ యోగ్యమైన భూమో కాదా అని మాత్రమే పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు.
భూ భారతి (ధరణి) నుంచి వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించి రైతు భరోసా జాబితా నుంచి సదరు లబ్దిదారులను తొలగించాలని అన్నారు.
రైతు భరోసా కింద ఏడాదికి ప్రతి ఎకరాకు 12 వేల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని అన్నారు.
వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు పంట వేసినా, వేయక పోయినా రైతు భరోసా అందుతుందని, రైతులలో అనవసర అపోహలు ప్రబల కుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు
ప్రతి మండలంలోని తహసిల్దార్, మండల వ్యవసాయ అధికారి పర్యవేక్షణలో వ్యవసాయ విస్తరణ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్లు, మైనింగ్ అధికారులు సంయుక్తంగా పని చేసి పట్టా దార్ పాస్ పుస్తకాల డేటా, గూగల్ మ్యాప్ , రెవెన్యూ మ్యాప్ వారీగా పరిశీలించాలని అన్నారు.సాగు నీటి ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ చేసిన భూములను చెరువులు, కుంటలలో ఉన్న భూములను డి మార్కింగ్ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.
జిల్లా పంచాయతీ అధికారి, పరిశ్రమల అధికారి, ఎంపిఓలు, పంచాయతీ కార్యదర్శులు సర్వే నెంబర్ల వారీగా అవ్వది భూములను డి మార్కింగ్ చేయాలని, పట్టణాలకు సమీపంలో పరిశ్రమలకు భూములు (రైస్ మిల్ పెట్రోల్ బంక్ టెక్స్టైల్ పార్క్ ఆహార శుద్ధి పరిశ్రమ), నాలా కన్వర్షన్ జరిగిన భూములు, లేఔట్ ఉన్న భూములు, ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తు భూముల వివరాలు రైతు భరోసా నుంచి తొలగించాలని అన్నారు.
రోడ్ల నిర్మాణానికి జరిగిన భూసేకరణ భూములు, మైనింగ్ కోసం అందించిన భూముల వివరాలను రైతు భరోసా నుంచి మినహాయించాలని, అర్హులైన ఏ ఒక్కరికి పథకం అందకుండా ఉండవద్దని, అదే సమయంలో అనర్హులకు ఎవరికి ప్రభుత్వ సహాయం ఆందవద్దని అన్నారు.
భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి 12,000 రూపాయలకు రెండు విడతలుగా అందించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించిందని, 2023-24 సంవత్సరానికి 20 రోజులు పని చేసిన భూమి లేని రైతు కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని అన్నారు.ఈ పథకం కుటుంబం యూనిట్ గా అందించడం జరుగుతుందని, వ్యక్తిగతంగా అందించే పథకం కాదని అన్నారు.
ప్రతి రెవెన్యూ గ్రామాన్ని జీపి వారిగా మ్యాప్ చేయాలని అన్నారు.జిల్లాలో 20 రోజులు ఉపాధి హామీ కూలీలుగా పని చేసిన కార్మికుల జాబితాను తీసుకొని ఆధార్ కార్డు ట్యాగ్ ప్రకారం పరిశీలిస్తూ భూమిలేని కుటుంబాలను ఎంపిక చేయాలని కలెక్టర్ తెలిపారు.
గ్రామ సభలో ఎంపిక చేసిన జాబితా పై ఏవైనా అభ్యంతరాలు వస్తే ఎంపిడీఓ 10 రోజుల లోగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
సామాజిక ఆర్థిక సర్వే కింద మన సిరిసిల్ల జిల్లాలో 9వేల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు లేదని తేలిందని, మండలాలలో ఎంపీడీవోలు, పట్టణాలలో మున్సిపల్ కమిషనర్ నూతన రేషన్ కార్డుల జారీ పర్యవేక్షించాలని అన్నారు.
గ్రామ లేదా వార్డు సభల ద్వారా అర్హులైన జాబితాన్ని ఆమోదింప చేసుకొని రేషన్ కార్డులను గణతంత్ర దినోత్సవ సందర్భంగా నూతన రేషన్ కార్డుల ప్రోసిడింగ్స్ పంపిణీ చేయాలని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నిర్వహించిన సర్వేలో భూములు కొన్న అత్యంత పేదలకు మొదటి జాబితాలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో స్క్రూటినీ నిర్వహించి 13.93 లక్షల దరఖాస్తులను మొదటి విడతలో పరిశీలనకు జిల్లాలకు అందిస్తున్నారని తెలిపారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వచ్చిన దరఖాస్తులను మరొకసారి చెక్ చేసుకోని, గ్రామాల వారీగా అర్హులను ఎంపిక చేసుకొని జిల్లా ఇంఛార్జి మంత్రి ఆమోదంతో ఉత్తర్వులు జారీ చేయాలని కలెక్టర్ తెలిపారు.
జనవరి 16 నుంచి జనవరి 20 వరకు క్షేత్రస్థాయి పరిశీలన చేసి జనవరి 21 నుంచి జనవరి 24 వరకు గ్రామసభలు నిర్వహించి ప్రభుత్వం చేపడుతున్న 4 కార్యక్రమాల మార్గదర్శకాలు, ఉద్దేశం ప్రజలకు వివరిస్తూ పథకాల అర్హుల జాబితాను ప్రజలందరికీ తెలిసేలా ప్రదర్శించాలని, ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత తుది జాబితా తయారు చేసే జనవరి 26 నుంచి 4 పథకాల అమలును ప్రారంభించాలని కలెక్టర్ అన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో డి.ఆర్.డి.ఓ.శేషాద్రి, డి.ఏ.ఓ.అఫ్జలి బేగం, మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు తహసిల్దార్లు, వ్యవసాయ ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.