రాజన్న సిరిసిల్ల జిల్లా దివ్యంగులు, మహిళలు, ట్రాన్స్ జెండర్ల స్వయం ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆద్వర్యంలో రూ.4.5 కోట్లతో మెడికల్ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి, మానకొండూరు ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా విప్ మాట్లాడారు.డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆద్వర్యంలో నిర్మించిన బంక్ లో దాదాపు 24 మంది దివ్యంగులు, మహిళలు, ట్రాన్స్ జెండర్ల కు ఉపాధి కల్పించామని తెలిపారు.
ప్రభుత్వ అవసరాలకు ఇదే బంక్ నుంచి పెట్రోల్, డీజిల్ ఇక్కడే కొనుగోలు చేయాలని కోరారు.ఈ బంక్ దేశం, రాష్ట్రంలోనే మొదటిదని చెప్పారు.దివ్యంగులు, మహిళలు, ట్రాన్స్ జెండర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం చొప్పదండి, మానకొండూరు ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడారు.
బంక్ ప్రారంభించేందుకు కృషి చేసిన కలెక్టర్ ను అభినందించారు.బంక్ సరిగా కొనసాగేలా, అభివృద్ధికి సిబ్బంది పనిచేయాలని సూచించారు.
దీని అభివృద్ధితో మీ అందరికీ ఉపాధి లభిస్తుందని తెలిపారు.ఇక్కడ జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీ రాజం, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







