నల్లగొండ జిల్లా:దేశాభివృద్దిలో శాస్త్ర, సాంకేతిక రంగానిది కీలక పాత్రని,సామాన్య ప్రజానీకంలో శాస్త్ర ప్రచారం చేస్తూ రాజ్యాంగం నిర్దేశించిన శాస్త్రీయ దృక్పథాన్ని విద్యార్థులు,ప్రజలు అలవర్చుకునేందుకు కృషి చేస్తున్న జనవిజ్ఞాన వేదిక సేవలు అభినందనీయమని మండల విద్యాధికారి భూక్యా లక్ష్మణ్ నాయక్ అన్నారు.గురువారం నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని మండల వనరుల కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించిన వారికి కస్తూరి ఫౌండేషన్ కోఆర్డినేటర్ గుడిపాటి కోటయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెమెంటోలను అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ పేద విద్యార్థులకు సులభ శైలిలో మౌలిక ఆధునిక విజ్ఞాన శాస్త్ర అంశాల్ని పరిచయం చేసేందుకు జనవిజ్ఞాన వేదిక బాలల సైన్సు మాసపత్రిక, విద్యార్థి చెకుముకిని నడుపుతోందని,ఈ పత్రిక నిర్వహణలో భాగంగా ప్రతి సంవత్సరం లక్షలాదిమంది విద్యార్థులకు చెకుముకి సైన్సు సంబరాలు పేరుతో ప్రతిభాపాటవ పరీక్షలు నిర్వహించడం ఎంతో మేలు చేస్తుందన్నారు.వేములపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ మాట్లాడుతూ విద్యార్థులలో శాస్త్రియ ధృక్పథాన్ని
పెంపొందించేందుకు వారిలో దాగివున్న అంతర్గత ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులను ఈ సంబురాలు ద్వారా భాగస్వాములను చేయడం శుభ పరిణామం అన్నారు.
ఈ పరీక్షలో ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమంలో ప్రథమ స్థానం జడ్పీహెచ్ఎస్ రావులపెంట,రెసిడెన్షియల్ విభాగంలో టీఎస్ మోడల్ స్కూల్,ప్రభుత్వ తెలుగు మీడియం విభాగంలో జడ్పీహెచ్ఎస్ రావులపెంట పాఠశాల విజేతలుగా నిలిచాయి.ప్రథమ స్థానంలో వచ్చిన పాఠశాల విద్యార్థులు ఈనెల 28న జిల్లా కేంద్రంలో నిర్వహించే జిల్లా చెకుముకి సైన్స్ సంబరాల పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో మైనం కృష్ణయ్య,ప్రభాకర్,శ్రీనివాస్ రావు,బ్రహ్మం,రామకృష్ణ,కల్పన,హేమ,ఎంఆర్సి సిబ్బంది లక్ష్మి, పార్వతి,సైదులు తదితరులు పాల్గొన్నారు.