వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం ప్రతి యేటా వేలాది మంది భారతీయులు కెనడా( Canada )కు వెళ్తుంటారు.వీరిలో అత్యధిక శాతం మంది పంజాబీలే.
దశాబ్ధాలుగా కెనడాతో వీరిది విడదీయరాని అనుబంధం.ఇలా వెళ్లే వారిలో క్రిమినల్స్ కూడా ఉండటం ఆందోళనకరం.
ఎన్నో పంజాబీ ముఠాలు కెనడాను అడ్డాగా చేసుకుని భారత్‌లో నేర సామ్రాజ్యాలను విస్తరిస్తున్నాయి.కిరాయి హత్యలు, డ్రగ్స్, ఆక్రమ ఆయుధాలు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో కెనడాలో వుంటూ పంజాబ్( Punjab )లో కార్యకలాపాలు సాగిస్తున్న గ్యాంగ్‌స్టర్‌లను పట్టుకునేందుకు తమకు సహకరించాలంటూ ఇటీవల కెనడా ప్రభుత్వాన్ని కోరారు సీఎం భగవంత్ మాన్.ఇప్పటికే పలువురు గ్యాంగ్‌స్టర్‌లపై పంజాబ్ ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో పాటు అప్పగింతపై కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూనే వున్నారు.
వీరిలో లఖ్‌బీర్ సింగ్ లాండా, అర్ష్ ధల్లా, గోల్డీ బ్రార్, రామన్ జడ్జి, రింకు రంధావా, బాబా డల్లా, సుఖా దునేకే ఇలా పేరు మోసిన గ్యాంగ్‌స్టర్లంతా కెనడాలోనే వున్నారు.
తాజాగా ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నారనే అభియోగాలపై పంజాబీ సంతతికి చెందిన ఐదుగురిని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు.వీరిలో మహిళ, ఆమె ఇద్దరు కుమారులు ఉండటం గమనార్హం.పీల్ రీజనల్ పోలీసులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.
బ్రాంప్టన్‌కు చెందిన నరీందర్ కౌర్ నగ్రా (61), ఆమె ఇద్దరు కుమారులు నవదీప్ నగ్రా (20), రవ్‌నీత్ నగ్రా (22), రణవీర్ అరైచ్ (20), పన్నీత్ నహల్ (21) ఉన్నారు.వీరిపై దాదాపు 160కి పైగా అభియోగాలు నమోదు చేశారు.
జూలై – సెప్టెంబర్ మధ్య స్పెషలైజ్డ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు ‘ప్రాజెక్ట్ స్లెడ్జ్‌హామర్’ నిర్వహించారు .
ఈ ఏడాది జూలైలో ట్రాఫిక్ పోలీసులు 20 ఏళ్ల యువకుడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి కూపీ లాగారు.దీనిలో భాగంగా గత నెలలో పీల్ రీజనల్ పోలీసులు, వాటర్లూ రీజనల్ పోలీస్, యార్క్ రీజనల్ పోలీసులు, ఆర్సీఎంపీ సహాయంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా 11 తుపాకీలు, 900 రౌండ్ల మందుగుండు సామాగ్రి, 53 గ్లాక్ సెలెక్టర్ స్విచ్, నిషేధించబడిన మేగజైన్లు స్వాధీనం చేసుకున్నారు.