నల్లగొండ జిల్లా:భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ముందు పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యారులు పుస్తకాలు చదువుతూ నిరసన తెలిపారు.అనంతరం ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్,ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ.8300 కోట్ల స్కాలర్షిప్,ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ, పీజీ,ఇంటర్మీడియట్, పారా మెడికల్ యజమాన్యాలు స్వయంగా కళాశాలలు బంద్ పెట్టి ఆందోళనలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రపోతుందా అని మండిపడ్డారు.పేద, మధ్య తరగతి విద్యార్థులకు అందించే స్కాలర్షిప్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతుందని ఆరోపించారు.
ప్రైవేట్ కళాశాలలో చదువులు పూర్తి చేసుకుని పై చదువులకు పోవాలంటే స్కాలర్షిప్,ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని, ఫీజు కట్టి సర్టిఫికెట్లు తీసుకుపోవాలని ప్రైవేట్ యజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నారని,మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అధికారంలోకి వచ్చిన సిఎం రేవంత్ రెడ్డి విద్యారుల గురించి పట్టించుకోవడం లేదని, ఇదేనా మార్పు అంటూ ప్రశ్నించారు.విద్యార్థులను విస్మరించిన ప్రభుత్వాలు బతికి బట్ట కట్టలేదన్న చరిత్రను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోవద్దని, తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్,ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని,లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను కూడగట్టి బలమైన విద్యార్థి ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈకార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కిరణ్,మున్నా జోసెఫ్, నవదీప్, కిరణ్, స్పందన, సన్ని, వంశీ, రాకేష్, ప్రశాంత్ వేణు, పవన్ తదితరులు పాల్గొన్నారు.