జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Deputy CM Pawan Kalyan ) నేటి నుంచి ప్రాయశ్చిత్త దీక్షను ప్రారంభించారు.ప్రస్తుతం పవన్ ప్రారంభించిన ఈ దీక్ష హాట్ టాపిక్ గా మారింది .
తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం( Tirumala Tirupati Laddu ) తయారీలో భారీగా అవినీతి జరిగిందని, కల్తీ నెయ్యి లడ్డూ తయారీకి ఉపయోగించారని టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో పవన్ ఈ దీక్షకు దిగారు.లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును సైతం ఉపయోగించారని టిడిపి ఆధారాలు చూపిస్తుండగా పవన్ దీనిపైనే ప్రాయశ్చిత్త దీక్షకు సిద్ధమయ్యారు.
తిరుమల క్షేత్రంలో జరిగిన అపవిత్రానికి క్షమించమని శ్రీవారిని కోరుకుంటూ 11 రోజులపాటు దీక్షను స్వీకరించనున్నారు.
ఈ మేరకు ఈరోజు నంబూరు లోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ ఈ దీక్షను స్వీకరించారు.ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్ కు దీక్ష కంకణం కట్టి ఆశీర్వదించారు. ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న ఈ దీక్ష( Deeksha ) వచ్చే నెల రెండో తేదీ వరకు కొనసాగనుంది.
ఈ దీక్ష తరువాత పవన్ నేరుగా తిరుమలకు వెళ్ళనున్నారు.ఈ మేరకు పవన్ కళ్యాణ్ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.తిరుపతి లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయని తెలియగానే తన మనసు వికలమైందని , ఈ దారుణాన్ని మొదట్లోనే కనిపెట్టలేకపోయామనే ఈ దీక్ష చేస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.
‘ అమృత తుల్యంగా, పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం ను గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రం అయింది.జంతు అవశేషాలతో మాలిన్యమైంది.విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు.
ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టక లేకపోవడం హైందవ జాతికే కళంకం. లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది.
అపరాధ భావానికి గురైంది .ప్రజా క్షేమాన్ని కాంక్షించే పోరాటంలో ఉన్న నాకు ఇటువంటివి కనీసం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది .కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే.అందులో భాగంగానే నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను ‘ అని పవన్ ట్వీట్ ద్వారా తెలియజేశారు.