సూర్యాపేట జిల్లా: ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలతో రూ.10,300 కోట్ల నష్టం జరిగిందని,తెగిపోయిన ఎడుమ కాల్వలకు, చెరువు కట్టలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి రైతంగానికి సాగు నీరు ఇవ్వటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) అన్నారు.ఆదివారం సూర్యాపేట జిల్లా ( Suryapet District )నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద ఎన్ఎస్పీ ఎడమ కాల్వకు పడిన గండి పునరుద్దరణ పనులను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి మంత్రి ఉత్తమ్ పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ఇంత త్వరగా గతంలో ఏ ప్రభుత్వాలు ఆదుకోలేదని,రాష్ట్రంలో వర్షాల వల్ల జరిగిన నష్టం పూర్తి నివేదికను కేంద్ర బృందం ద్వారా పంపడం జరిగిందని,కేంద్రం నుండి మంచి సహాయం రాష్ట్రానికి అందుతుందని విశ్వసిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.
రైతులకు నష్టం బాగా జరిగిందని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరదలు వచ్చిన మొదటి గంట నుండి సహాయక చర్యలకు ఆదేశించారని, ప్రతి మంత్రి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేశారన్నారు.
ఈ గండిని పూడ్చటానికి ప్రభుత్వం వెంటనే రూ.2.10 కోట్లు మంజూరు చేసిందని, రాత్రివేళ కూడా వర్క్ స్పీడ్ గా జరగడానికి ప్లడ్ లైట్స్ ఏర్పాటు చేశామని, ఇరవై నాలుగు గంటలు పని చేసి వారం రోజుల్లో గండి పూడ్చాలని అధికారులకు సూచించారు.సీఎం,డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు,అధికార యంత్రాంగం మొత్తం క్షేత్ర స్థాయిలో పర్యటించి వరద నష్టం నివారణ చర్యలు చేపట్టామని, ఇంతటి ప్రకృతి వైపరిత్యంలోనూ ప్రభుత్వం ఎక్కడ వెనకకు తగ్గకుండా ప్రజలకు సహాయక చర్యలు చేపట్టిందన్నారు.అనంతరం చిలుకూరు మండలం అర్లేగూడెం వద్ద గండి పడిన రెడ్లకుంట మేజర్ కాలువ పునరుద్దరణ పనులు పరిశీలించుటకు రైతులతో కలిసి మంత్రి ట్రాక్టర్ పై వెళ్లి కాలువ గండి మరమ్మత్తు పనులను పరిశీలించి,రూ.96.60 లక్షలు మంజూరు చేయడం జరిగిందని, వారం రోజులలో గండిని పూడ్చి రైతులకి సాగు నీరు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కాలువ ద్వారా క్రింది ప్రాంతాలలో 20 వేల ఎకరాలు సాగు చేస్తున్నారని,గండి పూడ్చటం ఆలస్యం అయితే నీరు లేక పొలాలు ఎండిపోతాయని,త్వరగతిన గండి పూడ్చి ఆయకట్టు రైతంగాన్ని ఆదుకోవాలని అధికారులకు సూచించారు.కాలువ మరమ్మత్తు పనులకు అవసరమయ్యే మట్టి, ఇసుక,యంత్రాలు,ఏవి కావాలంటే వాటికి అనుమతులు ఇవ్వాలని ఆర్డీవో,తహసీల్దార్లకు సూచించారు.
రెవిన్యూ అధికారులు,నీటిపారుదల అధికారులు సమన్వయం చేసుకుంటూ గండిని త్వరగా పూడ్చాలన్నారు.అలాగే కాలువకు గండి పడటంతో నష్టపోయిన రైతులకు త్వరలోనే నష్ట పరిహారం అందేలా చూస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు సూర్యనారాయణ,శ్రీనివాసులు,ఇరిగేషన్ ఎస్ఈ రమేష్ బాబు,తహసీల్దార్లు సరిత, ధ్రువకుమార్, నాగేందర్,ఇరిగేషన్ డిఈ రఘు,అధికారులు,ప్రజాప్రతినిధులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.