సూర్యాపేట జిల్లా:ఆదివారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఈనాడు ఆఫీస్ ఎదురుగా సెవెన్ లిక్కర్ మార్ట్ దగ్గర మద్యం మత్తులో రెండు వర్గాల యువకుల మధ్య జరిగిన వెన్నులో వణుకు పుట్టించే ఘర్షణ చూస్తే మద్యం మత్తు మనిషికే కాదు, సమాజానికి ఎంత అనర్ధమో ఇట్టే అర్థమవుతుంది.అసలు సమాజంలో జరిగే సకల దుర్గుణాలకు మూలం మద్యం మాత్రమే అంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు.
మద్యానికి బానిసైన మనిషి కన్నుమిన్నూ కానక మంచి చెడుల విచక్షణ కొల్పోయి,మానవ మృగంలా ప్రవర్తిస్తూ మానవ విలువలను మంట గలుపుతున్నాడు.దానికి పాలకులు,అధికారులు, వ్యాపారస్తులు తలో చెయ్యి వేసి వీలైనంత ఎక్కువగా ప్రోత్సహిస్తూ సమాజ వినాశనానికి తమ వంతు ప్రయత్నం నిరాటంకంగా కొనసాగిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
ఇది మనుషులకు ఎప్పుడు బుర్రకెక్కుతుందో ఎప్పుడు మానవత్వపు విలువలు కలిగి మనుషుల్లా మసులుకుంటారో కాలమే సమాధానం చెప్పాలి.ఇక వివరాల్లోకి వెళితే…సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనంతరం గ్రామానికి చెందిన యువకులు సూర్యాపేట పట్టణంలో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యారు.
పట్టణానికి చెందిన యువకులు కూడా పెళ్లికి వచ్చారు.అందరూ కలిసి పట్టణంలోని ఈనాడు ఆఫీస్ ఎదురుగా ఉన్న సెవెన్ లిక్కర్ మార్ట్ వద్దకు మద్యం తాగేందుకు వెళ్ళారు.
మద్యం తాగుతున్న సమయంలో అనంతరం,సూర్యాపేట యువకుల మధ్య మాటామాటా పెరిగి తాగిన మత్తులో ఘర్షణకు దారితీసింది.ఇంకేముంది చేతిలో ఉన్న బీరు సీసాలతో యువకులు చేసిన వీరంగం అంతా ఇంతా కాదు.
ఈ ఘర్షణలో పలువురికి తీవ్రమైన గాయాలు కాగా సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా,మచ్చ శరత్ అనే యువకుడిపై వెనుక నుండి బీరు సీసాతో దాడి చేయడంతో వెన్ను నిలువునా చీలిపోయింది.పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదారాబాద్ కు తరలించారు.
యువకుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా మద్యం అమ్మకాలు ఆగవు.
మనుషుల మాన ప్రాణాలు పోక తప్పదు