నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ హస్తం పార్టీలో ప్రోటోకాల్ రగడ తగులుతుంది.శుక్రవారం సాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాలువకు జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం దగ్గర జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు భారీ ప్లెక్సీ ఏర్పాటు చేశారు.అందులో ప్రొటోకాల్ ప్రకారం మంత్రుల,ఎమ్మెల్యేల ఫోటోలు వేశారు.
కానీ,ఈ కార్యక్రమానికి హాజరైన మూడు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫోటో వేయకుండా విస్మరించారు.
ప్లెక్సీలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫోటో లేకపోవడంతో మల్లన్న వర్గం,తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
బీసీల కోసం ఎంత వరకైనా కొట్లాడుతానని,బీసీల కోసం బడ్జెట్ లో అన్యాయం జరిగిందని, దానిని సవరించాల్సిన ఉందని శాసన మండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడిన విషయం అందరికి తెలిసిందే.బీసీ నేతగా బీసీల పక్షాన పోరాడుతానని ఒక సందర్భంలో తీన్మార్ మల్లన్న మాట్లాడారు.
ఉన్న ఒక్క బీసీ నాయకుడుపై ఇంత చిన్నచూపు ఏంటని పలువురు బీసీ సంఘాల నాయకులు సైతం నిలదీస్తున్నారు.సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పెద్దలపై మల్లన్న టీమ్ ఫైర్ అవుతున్నారు.
ఇది అధికారుల తప్పిదమా? నల్లగొండ రెడ్డీల పెత్తనమా? లేదంటే బీసీలంటే చిన్న చూపా? అంటూ ప్రశ్నిస్తున్నారు.అయితే మల్లన్న టీమ్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అంశంపై జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో, ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
అందరి ఎమ్మెల్యేల,మంత్రుల ఫోటోలు వేసి మల్లన్నను మర్చిపోవడం విచారకరమని,ఇది చిలికి చిలికి గాలి వానగా మారే అవకాశం ఉందని పలువురు మాట్లాడుకుంటున్నారు.