పవిత్ర మొహర్రం( Muharram ) పర్వదినాన్ని ముస్లిం సోదరులు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ క్రమంలో ఒమన్ రాజధాని మస్కట్‌లోని ఓ మసీదు తుపాకీ కాల్పులతో దద్ధరిల్లింది.
నగరంలోని వాది కబీర్ షియా ప్రాంతంలోని ఇమామ్ బర్గా అలీ బిన్ అబు తాలిబ్ మసీదులో( Imam Barga Ali Bin Abu Talib Mosque ) మొహర్రం సందర్భంగా సోమవారం రాత్రి అశూరా ప్రార్ధనలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఇంతలో గుర్తుతెలియని దుండగులు ప్రార్ధనల్లో పాల్గొన్న వారిని లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.మృతుల్లో నలుగురు పాకిస్తానీలు, ఓ పోలీస్ అధికారి ఉన్నారు.
క్షతగాత్రుల్లో వివిధ దేశాలకు చెందినవారు ఉన్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు మసీదును చుట్టుముట్టి ఎదురుకాల్పులకు దిగాయి.ఈ దాడికి పాల్పడిన ముగ్గురు దుండగులను హతమార్చినట్లు రాయల్ ఒమన్ ( Royal Oman )పోలీసులు ప్రకటించారు.అయితే దుండగులు కాల్పులకు ఎందుకు దిగారన్నది మాత్రం తెలియరాలేదు.
ఈ ఘటనపై ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది.కాల్పుల్లో ఒక భారతీయుడు మరణించగా, మరొకరికి గాయాలైనట్లు తెలిపింది.
మృతుడి కుటుంబానికి సంతాపం ప్రకటించడంతో పాటు అన్ని విధాలా సహకారం అందిస్తామని ఇండియన్ ఎంబసీ ఎక్స్‌లో ట్వీట్ చేసింది.
మరోవైపు మస్కట్‌లో( Muscat ) కాల్పుల ఘటన నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా స్పందించింది.అటువంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలని తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది.అటు మసీదుపై కాల్పులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది.
ఇమామ్ బర్గా అలీ బిన్ అబు తాలిబ్ మసీదుపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సైతం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ ఘటనకు కారకులైన వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు పాకిస్తాన్ సహకరిస్తుందని పేర్కొంది.