ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ను కొనసాగిస్తారా లేక పూర్తిగా ఈ వ్యవస్థను రద్దు చేస్తారా అనే విషయంలో టిడిపి , జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం తేల్చుకోలేకపోతోంది.గత వైసిపి ప్రభుత్వంలో ఏర్పాట యిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను అందించారు.
వృద్ధులు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్లు వారి ఇంటి వద్దకే వాలంటీర్ల ద్వారా పంపిణీ చేశారు.అయితే ఈ వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ , జనసేన లు మొదటి నుంచి విమర్శలు చేస్తూనే వచ్చాయి.
వాలంటీర్ గా పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది వైసీపీ సానుభూతిపరులే కావడంతో ఈ వ్యవస్థను రద్దు చేయాలని గత వైసిపి ప్రభుత్వంలోనే టిడిపి, జనసేన( TDP, Jana Sena )లు డిమాండ్ చేశాయి.అయితే ఎన్నికల సమయంలో మాత్రం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న 5 వేల గౌరవ వేతనం ను పెంచి పదివేలు గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలా రద్దు చేయాలా అనే విషయంలో తజ్జనభజన జరుగుతోంది.వాలంటీర్లు అందరూ వైసిపి ప్రభుత్వం నియమించిన వారే కావడంతో, వారు ఆ పార్టీకి ఇప్పటికీ సానుభూతిపరులు గానే ఉన్నారని భావిస్తోంది .ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా వారు పనిచేసే విధంగా ఆ పార్టీ ప్లాన్ చేసిందని విమర్శలు చేయడంతో పాటు, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల విధులకు వాలంటీర్లు దూరంగా ఉండాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఆ తరువాత దాదాపు లక్ష మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు ఏపీలో మొత్తంగా 2.57 మంది వాలంటీర్లను నియమించారు.
రాజీనామా చేసిన వారు మినహా, మిగిలిన వారిని కొనసాగిస్తారా లేక వారిని కూడా తొలగిస్తారా అనేది ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన వాలంటీర్ వ్యవస్థను( AP volanteer system ) పూర్తిగా రద్దు చేసి కొత్త నియామకాలు చేపట్టే ఛాన్స్ కూడా కనిపిస్తోంది.తాజాగా వాలంటీర్ వ్యవస్థపై హైకోర్టులో పిటిషన్ వేశారు.ఏపీలో నియమితులైన 2.57 లక్షల మంది వాలంటీర్ల నియామకంలో గత ప్రభుత్వం నియమ నిబంధనలు పాటించలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నియామకంలో రిజర్వేషన్లు పాటించలేదని పేర్కొనడంతో దీనిపై ప్రభుత్వానికి హైకోర్టు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జూలై నెల పింఛన్ సచివాలయం సిబ్బందితోనే పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో, ఒలంటీర్ల సేవలు కొనసాగింపు పై అనుమానాలు పెరిగిపోతున్నాయి.