నల్గొండ జిల్లా: కనగల్ మండల పరిధిలో రెండు పెట్రోల్ బంకులు ఉన్నా అందులో పెట్రోల్, డీజిల్ లభించదు.వాటి యాజమాన్యం నిబంధనల ప్రకారం బంకులలో స్టాక్ ఉంచకపోవడం,చుట్టుపక్కల గ్రామాలకు ఈ బంకులే ఆధారం కావడంతో మండల ప్రజలు, వాహనదారులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ సీజన్ దగ్గర పడడం, ఒకవైపు వర్షాలు కూడా పడుతుండడంతో రైతులు ట్రాక్టర్ ల ద్వారా దున్నకాలు షురూ చేస్తున్నారు.
కానీ,బంకుల్లో పెట్రోల్,డీజిల్ లేకపోవడం వలన దళారులను ఆశ్రయించాల్సిన వస్తుందని,దీన్ని ఆసరాగా తీసుకొని పెట్రోల్ బంకుల ముందే అధిక ధరలకు యధేచ్చగా అమ్మకాలు చేపడుతున్నారని,దీనితోవాహనదారులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారని వాపోతున్నారు.
ఇక్కడి విచిత్రం ఏమిటంటే అదే బంకులో పెట్రోల్ కొని,ఆ బంకు ముందే అధిక ధరలకు అమ్మడంతో వాహనదారులు మండిపడుతున్నారు.ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ చోద్యం చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పెట్రోల్ బంకు యాజమాన్యంపై చర్యలు తీసుకొని వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.