గత కొద్ది రోజులుగా పార్లమెంట్ ఎన్నికలపై పూర్తిగా దృష్టి సారించిన బీఆర్ఎస్ అధినేత కేసిఆర్( KCR ) పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు.తాజాగా నేడు వరంగల్ జిల్లాలో( Warangal District ) కేసీఆర్ పర్యటించనున్నారు.
ఈనెల 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర మొదలుపెట్టి జనాల్లోకి వెళుతున్న సంగతి తెలిసిందే.దీనిలో భాగంగానే నేడు బస్సు యాత్ర వరంగల్ కు చేరుకోనుంది.
హనుమకొండ చౌరస్తాలో జరిగే కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు .అలాగే వరంగల్ లోక్ సభ అభ్యర్థి సుధీర్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రజలను ఆయన కోరనున్నారు.

సాయంత్రం నాలుగు గంటలకు వరంగల్ కు చేరుకోనున్న కేసీఆర్ నేరుగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు .ఆతర్వాత అక్కడ నుంచి బస్సులో అదాలత్ సెంటర్ , అంబేద్కర్ సెంటర్ , పెట్రోలు పంపు జంక్షన్ మీదుగా హనుమకొండ చౌరస్తాకు చేరుకుని అక్కడ సభలో ప్రసంగించనున్నారు .కెసిఆర్ బస్సు యాత్రకు జనాల నుంచి విశేష స్పందన వస్తూ ఉండడంతో మెజారిటీ ఎంపీ స్థానాలను తాము గెలుచుకుంటామనే ధీమాతో బీఆర్ఎస్ ఉంది.
కాంగ్రెస్ ముఖ్య నేతలతో రేవంత్ భేటీ

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) నేడు కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో త్వరలో జాతీయ పార్టీల నేతలతో ఎన్నికల ప్రచారం నిర్వహించే విషయమే పార్టీ నాయకులతో చర్చించి రూట్ మ్యాప్ ను సిద్ధం చేయనున్నారు.
అలాగే వచ్చే ఎన్నికల్లో కనీసం 17 స్థానాలకు గాను 14 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించే విధంగా అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతల సలహాలు, సూచనలు తీసుకోమన్నారు.దీంతో పాటు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పదేపదే కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి చేస్తున్న విమర్శలను త్రిప్పి కొట్టే విధంగా సమాధానం చెప్పాలని ,అలాగే ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతు రుణమాఫీ అమలు చేస్తామని, ప్రజల్లోకి ఆ విషయాన్ని బలంగా తీసుకువెళ్లే అంశం పైన చర్చించనున్నారు.
ఇక ఈరోజు సాయంత్రం రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి , ఎల్.బి నగర్ రోడ్డు షోలు నిర్వహించనున్నారు.