నల్లగొండ జిల్లా:పల్లెలోకి పల్లె బస్సులు బంద్ చేయడంతో నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండల( Thirumalagiri ) ప్రజలు ఎండల్లో ప్రయాణం చేయాలంటే అల్లాడిపోతున్నారు.పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రయాణాలు తప్పడం లేదని,బస్సులు లేకపోవడంతో ఆటోలను ఆశ్రయించాల్సి వస్తుందని వాపోతున్నారు.
గతంలో మిర్యాలగూడ డిపో నుంచి వయా హాలియా నెల్లికల్, ఎర్రచెరువుతండా,జాల్ తండా,బట్టు వెంకన్నబావి తండా,సపావత్ తండా, గోడుమడుక,చింతలపాలెం,తిమ్మాయిపాలెం,చెన్నైపాలెం,నాయకుని తండా మీదుగా దామరచర్ల మండలం నడ్డిగడ్డ వరకు ప్రతిరోజు ఉదయం రెండు, సాయంత్రం రెండు ట్రిప్పులు ఆర్టీసీ బస్సు(RTC bus ) నడిచేదని,అంతేకాకుండా తిరుమలగిరి మండల కేంద్రం మీదుగా ఎల్లపురం, బోయగూడెం,రాజవరం వరకు బస్సు సర్వీస్ ఉండేదని,దీనితో మండల ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేదంటున్నారు.
కానీ, ఆర్టీసీ అధికారులు( RTC officials ) ఆ బస్సులను రద్దు చేశారని, ఎందుకు రద్దు చేశారో ఎవరికీ అర్ధం కావడం లేదనన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి కూడా మండల మహిళలు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బస్సు సర్వీసులు నడవడక సురక్షిత,సుఖమయ ప్రయాణం లేక ఆటో ప్రయాణాలతో నిత్యం అవస్థలు పడుతున్నామని అంటున్నారు.
బస్సులు లేక వ్యవసాయ పంటలు అమ్మకోవడానికి,విద్య,వైద్యం,వ్యాపార ఇతర అవసరాల కోసం పట్టణాలకు వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని,అయినా మండల ప్రజల గోడు పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు,ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని మండల ప్రజల రవాణా అవస్థలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.