సూర్యాపేట జిల్లా: వడ్ల కొనుగోళ్ళలో మిల్లర్లు,ప్రైవేట్ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు ఆరోపించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడా లేని విధంగా కేవలం కోదాడ నియోజకవర్గంలోని గ్రామాల్లోనే తరుగు పేరిట రైతులను దోచుకుంటున్న వ్యాపారుల పట్ల అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
గ్రామాల్లో వడ్ల వ్యాపారులు బస్తాకి డెభై కేజీలు చొప్పున తూకం వేసుకొని,వాటిని డెభై ఏడున్నర కేజీలకు మార్చి, తరుగు పేరిట రెండున్నర కేజీలు తగ్గించి రైతుకు డెభై ఐదు కేజీలకు మాత్రమే ధర చెల్లిస్తున్నారని తెలిపారు.
మిల్లర్లు బోరంలలో తెచ్చే వడ్లకు కింటాకు రెండు కేజీల చొప్పున తరుగు పేరిట తగ్గించి తొంభై కేజీలకు మాత్రమే రైతులకు పైకం చెల్లిస్తున్నారని చెప్పారు.
రైతులు నానా అగచాట్లు పడి,చెమటోడ్చి పండించిన పంటను కొనుగోళ్లప్పుడు మిల్లర్లు, వ్యాపారులు మోసాలకు పాల్పడటం క్షమించరాని నేరమన్నారు.అధికారులు తక్షణమే స్పందించి మిల్లర్లు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.