కోదాడ మండలం ద్వారకుంట గ్రామం( Dwarakunta )లో తాగునీటి కష్టాలు తీవ్రస్థాయికి చేరాయని మంగళవారం మహిళలు వీధులోకి వచ్చి ఖాళీ బిందెలతో త్రాగునీటి కష్టాలు( Drinking Water Problems ) తీర్చాలంటూ నిరసనలు తెలిపారు.ముఖ్యంగా గ్రామంలోని హరిజనవాడలో సరైన నీటి సరఫరా లేక త్రాగేందుకు గుక్కెడు నీరు రాక కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు.
తమ గోడును ఎవరికి చెప్పినా పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామపంచాయతీ ట్యాంకర్ ఉన్నప్పటికీ ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రాధాన్యత ఇవ్వకుండా గ్రామంలో చేపట్టే సీసీ రోడ్లు,డ్రైనేజీ పనులకు కాంట్రాక్టర్ అవసరాలు తీర్చేందుకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
ఇదేమిటని అడగగా కాంట్రాక్టర్ కు ఊరికే ఇవ్వడం లేదు 300 రూపాయలు చెల్లిస్తేనే ఇస్తున్నామంటూ సమాధానం చెబుతున్నారని,మరి దాహార్తిని తీర్చేందుకు ఎందుకు వాడడం లేదని ప్రశ్నించారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ మండలం ద్వారకుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చిందని, ఎమ్మెల్యే పద్మావతి మా త్రాగునీటికష్టాలు తీర్చాలని వేడుకున్నారు.