శరీరంలో కిడ్నీలు(మూత్రపిండాలు) ఎంత ముఖ్య పాత్ర పోషిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఆహారపు అలవాట్లు, పోషకాల లోపం, మారిన జీవనశైలి, ఆరోగ్యంపై తగిన శ్రద్ధ చూపకపోవడం, పలు రకాల మందుల వాడకం, మద్యపానం ఇలా రకరకాల కారణాల వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతోంది.
అందులోనూ ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూర్ బాధితులే ఎక్కువగా ఉంటున్నారు.అయితే మూత్రపిండాలు దెబ్బ తిన్నాయని లాస్ట్ స్టేజ్ వరకు గుర్తించకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
అందువల్లనే కిడ్నీల ఆరోగ్య పరిస్థితిని మొదటే పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.మరి ఇంతకీ కిడ్నీ ఫెయిల్ అవుతుందని సూచించే లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా కీళ్ల వాపు సమస్య వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది.అయితే మూత్ర పిండాలు దెబ్బ తింటున్నప్పుడు కూడా కీళ్ల వాపు సమస్య ఇబ్బంది పెడుతుంది.
అలాగే వాటర్ ఎంత తీసుకున్నా యూరిన్ రాకపోవడం, యూరిన్ కలర్ మారడం, యూరిన్ లో రక్తం, యూరిన్ కి వెళ్లినప్పుడు ఇబ్బందిగా అనిపించడం వంటివి కూడా కిడ్నీలు రిస్క్‌లో ఉన్నాయని సూచించే లక్షణాలే.మతిమరుపు, తరచూ తీవ్రమైన తలనొప్పి ఇబ్బంది పెట్టడం, అలసట, ఏకాగ్రత్త లోపించడం, పక్కటెముకల కింది భాగంలో నొప్పి వంటి లక్షణాలు మీలో ఉంటే ఖచ్చితంగా కిడ్నీలను టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.
మూత్రపిండాలు దెబ్బ తింటున్నాయి అంటే ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోవడం, గుండె కొట్టుకునే వేగం మార్పులు రావడం, రక్త పోటు స్థాయి పెరిగి పోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.ఇక రక్త హీనత, ఆకలి లేకపోవడం, చర్మంపై దురదలు, తీవ్రమైన కండరాల నొప్పులు వంటి వాటితో తరచూ ఇబ్బంది పడుతున్నా డాక్టర్‌ను సంప్రదించి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.